కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల గండం

– ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట తప్పిన ప్రభుత్వం
– రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తుతోన్న నిరుద్యోగులు
– తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్న మొదటి ప్రభుత్వం ఇదే

నిర్దేశం, హైదరాబాద్: పాములు పట్టేవాడు పాము కాటుకే మరణించినట్లు.. నిరుద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వారే శాపంలా మారుతున్నారు. ఎన్నికల్లో ఇష్టారీతిన ఇచ్చిన హామీలే కాంగ్రెస్ మెడకు పాములా చుట్టుకున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చమన్నందుకు ఇప్పుడదే నిరుద్యోగులపై లాఠీ ఝుళిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వంపై నిరుద్యోగులు పెద్ద యుద్ధానికే సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ హామీల్లో మార్పు
శుక్రవారం చేపట్టిన టీజీఎస్‭పీఎస్‭సీ ముట్టడి చాలా ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగులను నిరసన చేసేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని చెప్పిన ప్రభుత్వమే నిరుద్యోగులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున కంచెలు వేసింది. తెలంగాణలో మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ మాటల్లో చేతల్లో లెక్కలేనంత మార్పు తీసుకువచ్చింది. ఒక్కమాట సూటిగా చెప్పాలంటే.. అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కారు రికార్డు కొట్టేసింది.

నిరుద్యోగులు నిరసన ఎందుకు?
గ్రూప్‌ పోస్టుల సంఖ్య పెంచాలి, గ్రూప్‌1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి, మెగా డీఎస్సీ ఇవ్వాలి, జీవో 46 రద్దు చేయాలి, నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి తదితర డిమాండ్లతో నిరుద్యోగులు నిరసన చేస్తున్నారు. ఇవన్నీ నిరుద్యోగులు కొత్తగా కోరుతున్న గొంతెమ్మ కోర్కెలు కాదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఓటుకు ముందు నాలుగు సార్లు, వెనక నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు.

నిరుద్యోగులపై తీరు అభ్యంతరకం
ప్రభుత్వ బాధ్యతగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నిరసన చేపట్టిన నిరుద్యోగులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మొన్నామధ్య గాంధీ ఆసుపత్రిలో నిరుద్యోగులు చేపట్టిన నిరసనపై లాఠీ పంజా విసిరారు. నిరసన చేస్తున్న నిరుద్యోగుల ఐకాస నేత మోతీలాల్ నాయక్ ను కలిసేందుకు వచ్చిన వారిని కూడా వదల్లేదు. నిరుద్యోగుల ఫోన్లు, కదలికలపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వంపై నిరసన తెలిపే నిరుద్యోగిగా కనిపించినా కేసులు వేసే పరిస్థితి ఉందంటూ నెటిజెన్లు విమర్శిస్తున్నారు.

గతం మర్చిపోతే ఎట్లా?
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా సహా అన్ని యూనివర్సిటీల్లో, గ్రంథాలయాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అశోక్, బక్క జడ్సన్ సహా పలువురు నిరుద్యోగులకు మద్దతుగా నిరసన చేపట్టారు. పరిస్థితి విషమించే స్థాయికి పోతున్నా కూడా ప్రభుత్వం మొండిగానే వ్యవహరిస్తోంది. ప్రజా ప్రయోజనాల మాట అటుంచితే తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికైనా ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సెగకే కూలిందనే వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చి పోతే ఎట్లా?

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!