నిర్దేశం: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగమే అంతా. చాలామంది రోజంతా మొబైల్ ఫోన్లను వివిధ అవసరాల కోసం వాడుతున్నారు. అయితే వీటితో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రివేళ పడుకునే సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను పక్కనే పెట్టుకోవడం చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.
లైంగిక సమస్యలు
స్మార్ట్‌ఫోన్ల నుంచి వచ్చే వైర్‌లెస్ రేడియేషన్, వ్యక్తుల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా మగవారిలో స్పెర్మ్ డ్యామేజ్ అవ్వడంతో పాటు స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. గర్భిణీ స్త్రీలపై ఒత్తిడి, అలసట, నిద్రకు భంగం వంటి ప్రతికూల ప్రభావాలకు సెల్‌ఫోన్ రేడియేషన్ కారణం అంటున్నారు.
మానసిక ఆరోగ్య సమస్యలు
రాత్రి ఫోన్ ఎక్కువ సమయం వాడేవారు ఆలస్యంగా నిద్రపోవచ్చు. అర్ధరాత్రి తర్వాత పడుకోవడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ అలవాటు టీనేజర్లలో డిప్రెషన్ రిస్క్‌ను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతాయి.
వైర్‌లెస్ రేడియేషన్
ఫోన్‌కు దగ్గరగా నిద్రిస్తుంటే, హానికరమైన వైర్‌లెస్ రేడియేషన్‌కు గురవుతారట. అయితే మొబైల్ ఫోన్ల నుంచి వైర్‌లెస్ రేడియేషన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. బెడ్ మీద పడుకుని ఫోన్‌లను వాడేవారికి తల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని WHO పేర్కొంది. మొబైల్ రేడియేషన్ మెదడు కార్యకలాపాలు, కాగ్నిటివ్ బిహేవియర్‌పై ప్రభావం చూపుతుంది.
నిద్రలేమి
స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్స్ నుంచి రిలీజ్ అయ్యే బ్లూ లైట్, నిద్రను ప్రభావితం చేస్తుందని చాలా పరిశోధనలు నిరూపించాయి. ఇది సిర్కాడియన్ రిథమ్‌పై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. సిర్కాడియన్ రిథమ్ అనేది గత 24 గంటల్లో ఒక వ్యక్తి మెంటల్, ఫిజికల్, బిహేవియరల్ ఛేంజెస్‌ని సూచించే నేచురల్ సైకిల్. పడుకునే 2-3 గంటల ముందు కూడా ఫోన్ వాడుతుంటే, నిద్రకు ఆటంకం కలగడం, నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది.
కంటి సమస్యలు
ఎక్కువ గంటలు ఫోన్‌లు వాడే వారికి కంటి నొప్పి, కళ్లు పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాత్రి బెడ్‌పై పడుకొని మొబైల్ ఫోన్ వాడితే కళ్లు స్ట్రెయిన్ అవుతాయి. స్మార్ట్ ఫోన్లు బ్లూ లైట్‌ను విడుదల చేస్తాయి. ఇది కంటి రెటీనాపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల చూపు మందగించడం, కళ్లు పొడిబారడం, దురద, తలనొప్పి వంటివి వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అందుకే నిద్రపోయే సమయంలో స్మార్ట్‌ఫోన్‌లను బెడ్‌కు దూరంగా ఉంచాలని డబ్ల్యూహెచ్‌ఓ గతంలోనే సూచించింది. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రాత్రిపూట ఫోన్‌ని సైలెంట్ లేదా ఫ్లైట్ మోడ్‌లో ఉంచడానికి ప్రయత్నించండి. సమయానికి నిద్రపోయేందుకు ప్రయత్నించండి.