– 1600 ఏళ్ల కిందట నలంద యూనివర్సిటీ స్థాపన
– ప్రపంచంలో ఇదే మొదటి విశ్వ విశ్వవిద్యాలయం
– పునర్నిర్మించాలని ప్రతిపాదించిన అబ్దుల్ కలాం
– 2014 నుంచి తరగతులు, తాజాగా శాశ్వత భవనం
నిర్దేశం, హైదరాబాద్: చదువు అనగానే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, కాలిఫోర్నియా లాంటి విశ్వవిద్యాలయాల పేర్లు వినిపిస్తుంటాయి. కానీ, ప్రపంచంలో మొదటి విశ్వవిద్యాలయం మన దేశంలోనే స్థాపించబడిందని ఎంత మందికి తెలుసు? లక్షల మందికి జ్ణానాన్ని అందించిన ఈ విశ్వవిద్యాలయం అన్యమతాల విస్తరణలో నేలకొరిగింది. బౌద్ధాన్ని అంతం చేసే కుట్రలో జ్ణానం సమాధైంది. మళ్లీ ఇన్నేళ్లకు నలంద పేరుతో విశ్వవిద్యాయాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పార్లమెంటులో బిల్లు ఆమోదించిన 14 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి సామర్థ్యంలో విశ్వవిద్యాలయం పున: ప్రారంభం అయింది.
నలంద చరిత్ర
నలంద అంటే పాళీ భాషలో జ్ణానాన్ని ఇవ్వడం. కాగా, విద్యార్థులకు భోజనం, వసతి సదుపాయాలతో ఏర్పడ్డ మొదటి విశ్వవిద్యాలయం నలంద. బౌద్ధమతం ఏలుతున్న సమయంలో గుప్తుల కాలంలో కుమార గుప్తుడు సామాన్య శకం 450 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.. ఆ సమయంలోనే 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది అధ్యాపకులు ఉండేవారు. 9 అంతస్థుల్లో 90 లక్షల పుస్తకాలతో నలంద విశ్వవిద్యాలయ లైబ్రరీ ఉండేందంటే.. విద్య గురించి ఆ రోజుల్లోనే ఎంతటి ప్రాధాన్యం ఉండేది, నలంద విశ్వవిద్యాలయం ఎంతటి జ్ణానాన్ని అందించిందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులను వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసేవారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ విద్య, వసతి, భోజనం అన్నీ ఉచితంగా ఉండేవి. ఇందులో భారత్ నుంచే కాకుండా కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, ఇరాన్, గ్రీస్, మంగోలియా వంటి దేశాల నుంచి విద్యార్థులు చదువుకునేందుకు వచ్చేవారు. వేల కిలోమీటర్ల వరకు జ్ణానాన్ని, బౌద్ధాన్ని విస్తరించింది. నలంద ఆనవాళ్లు 1,50,000 కిలోమీటర్ల వరకు ఉంటాయని చైనాకు చెందిన హ్యూయన్ త్సాంగ్ అనే చరిత్రకారుడు తెలిపాడు.
అబ్దుల్ కలాం ముందడుగు
నలంద విశ్వవిద్యాలయాన్ని పున: ప్రారంభించాలని 28 మార్చి 2006న బీహార్ విధాన్ మండల్ జాయింట్ సెషన్‌లో మొదటిసారి దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రతిపాదించారు. అనంతరం, 2007లో బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం నలంద విశ్వవిద్యాలయం బిల్లు-2010ను ఆమోదించింది. అదే ఏడాది ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించింది. 21 సెప్టెంబర్ 2010న రాష్ట్రపతి ఆమోదంతో ఉనికిలోకి వచ్చింది.
నలంద యూనివర్సిటీ
నలంద పురాతన విశ్వవిద్యాలయం నలంద సమీపంలో ఉండగా.. యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ను కొంత దూరంలో ఉన్న రాజ్గిర్ లో నిర్మించారు. 485 ఎకరాల్లో రూ.1,800 కోట్లతో నిర్మించారు. ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి 18 దేశాలు మద్దతునివ్వడం విశేషం. వాస్తవానికి 2014 సెప్టెంబర్ నుంచే తరగతులు ప్రారంభమైనప్పటికీ.. తాజాగా శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభమైంది.