కేసీఆర్ పాలనలో ‘‘ఫోన్ ట్యాపింగ్’’ మాయని మచ్చ..

ఫోన్ ట్యాపింగ్ తోనే ఫాంహౌస్ కుట్ర

  • సైబరాబాద్ పోలీసులకు లింక్..?
  • మీడియాకు ముందే సమాచారం..?
  • ఫాంహౌజ్ లో 15 కోట్లు.. ఫోన్ ట్యాపింగ్ తోనే తెలిసిందేనా…?

(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)

ఫోన్ ట్యాపింగ్… ఖాకీ డ్రెస్ వేసుకుని గులాబీకి ఊడిగం చేసిన పోలీసు అధికారుల లీలలు ఒక్కొక్కటి బహిర్గతమవుతున్నాయి. ప్రతిపక్ష నేతల రహస్యాలను తెలుసుకోవడానికి కొందరు పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ ద్వారా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన తీరుతో పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఈ ఫోన్ ట్యాపింగ్ మాయని మచ్చలా మిగిలింది.

బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై నిఘా..

కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.  పార్టీ వీడుతారని అనుమానంతో కొందరు ఎమ్మెల్యేలపై నిఘా పెట్టడం వల్లనే ఈ గుట్టు రట్టైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మాట్లాడిన రికార్డులను బీఆర్ ఎస్ బాస్ కు వినిపించిన అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం బీజేపీ కుట్రలను భగ్నం చేయడానికి అదే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ తోనే ఫాంహౌస్ కుట్ర..

చట్టం ఎవరికి చుట్టం కాదు.. తప్పు ఎవరు చేసినా వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. కానీ.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్ లో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్​రెడ్డి, పైలట్​ రోహిత్​రెడ్డి, రేగా కాంతారావులను ప్రలోభ పెట్టి తలా 100 కోట్ల రూపాయలను అప్పజెప్పి పార్టీ ఫిరాయించేలా మంతనాలు జరిపిందానేది ఆరోపణ. ఈ కుట్రలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంతోనే సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు భాగస్వాములు అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు విషయంలో ఫోన్ ట్యాపింగ్ సమాచారం కీలకంగా వ్యహరించిందనడానికి పోలీసులు వ్యవహరించిన తీరే నిదర్శనం.

ఫాంహౌస్ కుట్రలో పోలీసులు..

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మొయినాబాద్​ లోని అప్పటి తాండూర్ ఎమ్మెల్యే పైలట్​ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో పోలీస్ బాస్ ఆదేశాలతో  పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసు బాస్ అన్నీతానై వ్యహరించిన తీరు కూడా చట్ట విరుద్దమే అనే టాక్ వినిపిస్తోంది. చట్ట విరుద్దంగా ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు ఆ సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహరంలో భాగస్వాములైన పోలీసు అధికారులు కూడా ఆ కుట్రలో నేరస్థులేనని అంటున్నారు న్యాయనిపుణులు.  

ఫాంహౌజ్ లో 15 కోట్లు..?

మొయినాబాద్​ ఫాంహౌస్​లో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ మంతనాలు జరిపినప్పుడు 15 కోట్లు స్వాధీనం చేసుకున్నామని మీడియాకు అప్పటి పోలీసు బాస్ చెప్పారు. సినీ ఫక్కిలో తాము రెడ్ హ్యండ్ గా పట్టుకున్నామని  ఆయన పేర్కొన్నారు. అయితే.. ప్రభుత్వ అనుకూల మీడియాలో వంద కోట్ల వరకు ఫాంహౌజస్ లో డబ్బుల కట్టలు లభించినట్లు కథలు ప్రచారం అయ్యాయి. అప్పటి సైబరాబాద్ పోలీసు బాస్ సైతం 15 కోట్లు లభించినట్లు ముందుగానే చెప్పడం వెనుక ఫోన్ ట్యాపింగ్ సమాచారం కావచ్చని పోలీసు వర్గాలలో చర్చ జరుగుతోంది.

ఫోన్ ట్యాపింగ్ లో మీడియాకు లింక్

మొయినాబాద్​ ఫాంహౌస్​లో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మీడియా పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలనే ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉందని అతని ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అయితే.. ఆ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వార్త సేకరణకు కొన్ని మీడియా సంస్థలకే సమాచారం ఉండటం వెనుక ఈ ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది.

అయితే.. హైకోర్టు సైతం పోలీసుల విచారణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలులో 15 కోట్లు ఇచ్చారని చెప్పడం.. ఎమ్మెల్యేలతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరులో పోలీసుల పాత్రపై విశ్వసనీయత లేదని కోర్టు భావించింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సీబీఐ విచారణ నిలిపి వేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంలో ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఇంకా ముందుకు వెళ్లలేదు.

ఇప్పటికైనా మొయినాబాద్​ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై లోతుగా విచారణ జరిపిస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సైబరాబాద్ పోలీసుల పాత్ర కూడా బహిర్గతం అవుతుంది.

యాటకర్ల మల్లేష్

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!