రాబోయే కాలంలో నేనే సీఎం..
– బీజేపీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్మాసం
– కామారెడ్డి ఎమ్మెల్యే సంచల వ్యాఖ్యలు
– తుది శ్వాస వరకు మోదీతోనే..
కాటిపల్లి వెంకట రమణారెడ్డి.. అసెంబ్లీ ఎన్నకల ఫలితాల తరువాత ప్రజల నోట్లో నానుతున్న పేరు. తాజా మాజీ సీఎం కేసీఆర్ ను.. సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికలలో ఓడించి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇద్దరు మొనగాళ్లను ఓడించిన మొండిఘటం అనే పేరుంది అతనికి. నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే అతని పొలిటికల్ స్టైలే వేరు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు చాలేంజ్ గా తీసుకున్న ఎన్నికలలో ఓట్లను నోట్లతో కొనకుండా గెలిచిన చరిత్ర అతని సొంతం.
కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఏది చేసినా హల్ చలే.. ఎమ్మెల్యేగా గెలిచినోళ్లు అధికార పార్టీలోకి వలసలు వెళుతున్నారు. ఇగో.. వెంకట రమణారెడ్డి కూడా పార్టీ ఫిరాయిస్తారనే అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యార్థులు ప్రచారం చేశారు. అంతే.. తుదిశ్వాస వరకు తాను బీజేపీలోనే మోదీతో ఉంటానని చేతిపై పచ్చబొట్టు వేసుకోవడం చర్చనీయాంశమైంది. అలాగే అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని మీడియా ద్వారా అధికారులను హెచ్చరించారు ఎమ్మెల్యే.
రాబోయే కాలంలో నేనే సీఎం..
ఔను.. మీరు చదివింది నిజమే.. రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రిని అంటూ సంచలన ప్రకటన చేశారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భవిష్యత్ లో ముఖ్యమంత్రిని అవుతానని మనసులోని మాటను బయట పెట్టారు. 2028లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అప్పుడు తానే సీఎం ను అవుతానన్నారు వెంకటరమణారెడ్డి. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాక పోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుని ఎవరికి మొఖం చూయించనన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే. వెంకటరమణారెడ్డి పొలిటికల్ స్టైల్ చూసి చర్చించుకుంటున్నారు జనం.