ఒంటరిగానే బీజేపీ పోటీ

ఒంటరిగానే బీజేపీ పోటీ
– రాష్ట్ర నేతలకు దిల్లీ పెద్దల హింటు
– టికెట్ల కోసం తీవ్ర పోటీ
– నేడు కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. ఈ విషయమై దిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకులకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. దిల్లీ పెద్దలు స్పష్టత ఇవ్వడం వల్లే రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు విషయమై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో శ్రేణులు డీలా పడ్డాయి. పొత్తు ఉండబోదని స్పష్టత రావడంతో ఊపిరి పీల్చుకున్నాయి. శనివారం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పొత్తు పై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

బీజేపీ టికెట్ లకు డిమాండ్

రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలో బీజేపీ టికెట్ లకే ఎక్కువ డిమాండ్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ విధానాలు, మోదీ ఇమెజ్ గ్రామీణ ప్రాంతల్లోకి చొచ్చుకుని పోయినందున ఎక్కువ మంది ఆ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ స్థానాలకు కూడా పోటీ ఉంది. నిజామాబాద్ లో సిట్టింగ్ ఎంపీ అర్వింద్ ఉండగా, ఇక్కడ టికెట్ ను యెండెల లక్ష్మీనారాయణ, అల్జాపూర్ శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్ లతో పాటు తటస్థులు డాక్టర్ కేశవులు, మంచాల జ్ఞానేశ్వర్ గుప్తా ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ లో సోయం బాబురావు సిట్టింగ్ ఎంపీకాగా, రమేష్ రాథోడ్ తో పాటు మరో ఇద్దరు ఆశిస్తున్నారు. ఈటెల రాజేందర్ మల్కాజిగిరి, కరీంనగర్ లలో ఏదో ఒకటి ఆశిస్తున్నారు. మల్కాజిగిరిలో మురళీధర్ రావు, చాడ సురేష్ రెడ్డి, కొమురయ్య, పన్నాల హరీష్ రెడ్డితో పాటు మరో నలుగురైదుగురు ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ లో డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఆశిస్తున్నారు.

బీఆర్ఎస్ సిట్టింగ్ ల చూపు బీజేపీ వైపు

పలువురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడానికి అనుకూలంగా ఉన్నారని సర్వేలలో తేలుతుండడంతో బీజేపీలో చేరి పోటీ చేయాలని భావిస్తున్నారు. జహీరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీలు బీబీ పాటిల్, రాములు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు బండి సంజయ్ పరోక్షంగా చెప్పారు. ఇటీవల బీబీపాటిల్ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేసిందనడం పార్టీ మారుతారనడానికి బలం చేకూరుతోంది.

ఎన్నికల శంఖారావం

అన్ని పార్టీల కంటే ముందుగా బీజేపీ ఈ నెల 20 న ఎన్నికల శంఖారావం పూరించింది. విజయ సంకల్ప యాత్ర పేరిట ఐదు క్లస్టర్ లలో యాత్ర నిర్వహిస్తున్నారు. యాత్రలో అన్ని నియోజకవర్గాలు కవర్ కానున్నాయి. ఈ యాత్రలకు ఆయా ప్రాంతాలలో ఆదరణ లభిస్తుండడంతో బీజేపీ శ్రేణులలో నూతనోత్సాహం కనిపిస్తోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »