మరో రెండు గ్యారంటీల అమలు

మరో రెండు గ్యారంటీల అమలు
27 లేదా 29వ తేదీన ప్రారంభం
గృహ లక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు
విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలుగా గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ. 500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. ఏజెన్సీలకు చెల్లించాలా..? అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్నిఅనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనుమానాలు అపోహాలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »