పొత్తు పొడిచేనా…
- బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పై విస్తృత ప్రచారం
- ఖండించిన కిషన్ రెడ్డి, బండి, లక్ష్మణ్, ఈటెల
- బీఆర్ఎస్ నేతల మౌనం
రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంశం ప్రధాన చర్చగా మారింది. ఏ ఇద్దరు, ముగ్గురు నేతలు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో ప్రధాన చర్చగా మారడంతో బీజేపీ నాయకులు దీనిపై స్పందించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇది వరకే స్పందించగా, తాజాగా సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. తలకాయ ఉన్న వారెవరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని బండి సంజయ్ ఘాటుగా మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని కె. లక్ష్మణ్ అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు ఈ విషయమై స్పందించడం లేదు.
పొత్తుకే బీఆర్ఎస్ నేతల మొగ్గు
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ నేతలు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ తోనూ తమ అభిప్రాయాలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మనుగడ సాధించాలంటే పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు మోదీ హవా ఉండడం, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల ప్రభావం చూపలేక పోతామని అంటున్నారు. ఒకవేళ సీట్లు రాకపోతే వలసలు ఎక్కువవుతాయని, పార్టీ ఉనికికే ప్రమాదకరమంటున్నారు. పార్టీలో సైతం దీనిపై సీరియస్ చర్చ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్
రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు పొత్తుపై ప్రచారాన్ని ఖండిస్తున్నప్పటికీ, అధిష్ఠానం నిర్ణయం ఫైనల్ కానుంది. ఇండియా కూటమిని దెబ్బ తీయడమేగాక, 400 పైన సీట్లు సాధించాలనే లక్ష్యంతో పలు పార్టీలను ఎన్డీయే కూటమి ఆహ్వానిస్తోంది. ఇప్పటి వరకు రెండు సార్లు బీజేపీతో తెగతెంపులు చేసుకుని, విమర్శలు చేసిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను చర్చలకు పిలిచారు. బీజేపీతో వైసీపీ అనుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వొద్దనే ఉద్దేశంతో చర్చలు జరిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించాలంటే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలి. కవితను అరెస్టు చేయకపోవడంతో రెండు పార్టీలు ఒక్కటేననే ప్రచారం ఉంది. రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేస్తే ఓట్లు చీలి కాంగ్రెస్ కు లాభం జరుగుతుందని, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇదే జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని అంటున్నారు.