దక్షిణాఫ్రికాలో భారత కౌన్సిల్ జనరల్‌తో సమావేశమైన సందీప్ మఖ్తల బృందం
– డబ్ల్యూటీఐటీసీ ఆఫ్రికన్ సమిట్‌కు అండగా నిలుస్తామన్న కౌన్సిల్ జనరల్
– డబ్ల్యూటీఐటీసీ చొరవపై ప్రశంసలు
– కౌన్సిల్ జనరల్ సంఘీభావంపై డబ్ల్యూటీఐటీసీ హర్షం
నిర్దేశం, జొహనస్‌బర్గ్ :
వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) వ్యాపార విస్తరణ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాలో భారత కౌన్సిల్ జనరల్‌తో సమావేశమైంది. దక్షిణాఫ్రికాలోని భారత కౌన్సిల్ జనరల్ శ్రీ మహేశ్ ఐఎఫ్ఎస్‌తో 15 మంది సభ్యులతో కూడిన డబ్ల్యూటీఐటీసీ బృందం భేట జరిగింది. డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మఖ్తల సారథ్యంలోని ఈ బృందం నిర్వహించిన విస్తృత సమావేశంలో భారతదేశం మరియు దక్షిణాఫ్రికాల మధ్య టెక్నాలజీ ఎక్సేంజ్, వ్యాపారం, వివిధ రంగాల్లో ఒప్పందాలు వంటి అంశాలపై చర్చించారు.
జొహనస్‌బర్గ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాలో భారత కౌన్సిల్ కార్యాలయంలో కౌన్సిల్ జనరల్‌తో డబ్ల్యూటీఐటీసీ బృందం సమావేశమైంది. డబ్ల్యూటీఐటీసీ బృందానికి చెందిన ముఖ్యులు కిశోర్ పుల్లూరి, నాగరాజ్ గుర్రాల, రెలాన్ రంజన్, ప్రవీణ్ మీరెడ్డి, వెంకట్ ఓరుగంటి, జయదీప్ మథరాశి, విక్రాంత్ మూల, తుమ్మల గౌతమ్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య టెక్నాలజీ అంశాలలో సమన్వయం, వ్యాపార అంశాల్లో పరస్పర ప్రయోజనాలు, నూతన వ్యాపార అవకాశాల అన్వేషణ వంటివి ఈ సందర్భంగా విపులంగా చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా శ్రీ మహేష్ ఇండియా మరియు దక్షిణాఫ్రికా దేశాల యొక్క ప్రయోజనాల కోసం డబ్ల్యూటీఐటీసీ బృందం చూపిస్తున్న ప్రత్యేక చొరవను ప్రశంసించారు. దీంతోపాటుగా తన వంతు సహాయ సహకారాలు అందించనున్నట్లు హామీ ఇచ్చి డబ్ల్యూటీఐటీసీ ఆఫ్రికన్ సమిట్‌కు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ సమిట్ ద్వారా ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ఔత్సాహికుల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగి కలిగే ప్రయోజనాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సమిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
దక్షిణాఫ్రికాలో భారత కౌన్సిల్ జనరల్ శ్రీ మహేశ్‌తో సమావేశం ద్వారా టెక్నాలజీ రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత విస్తృతి చెందనున్నాయని డబ్ల్యూటీఐటీసీ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆవిష్కరణలు, ఒప్పందాలు, ప్రపంచ ఐటీ రంగంలో ఇరు దేశాల వృద్ధి చోటుచేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది. డబ్ల్యూటీఐటీసీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో తమ ముద్రతో ముందుకు సాగడమే కాకుండా ఆవిష్కరణలు మరియు వ్యాపార సంబంధ అంశాల్లో కృషి కొనసాగించనుంది.