ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం
: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 23 : “తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండు. బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్.. కేసీఆర్ కొడుకు కేసీఆర్ లాగే మోసం చేస్తాడు తప్ప ప్రజల కోసం ఆలోచించరు..మూడోసారి ప్రజల్ని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు…మళ్లీ మోసపోవద్దు…తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తూముకుంట మునిసిపల్ కేంద్రంలో బీజేపీ, బీఆరెస్ నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. రాజకీయంగా నష్టపోయినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియాగాంధీకి కృతజ్ఞత తెలిపే బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. “1200 మంది అమరుల త్యాగాలను చులకన చేస్తూ నిన్న కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ బిడ్డల ప్రాణాల విలువ నీకు తెలుసా కేసీఆర్? చేగువేరా, నెల్సన్ మండేలా, సుభాష్ చంద్రబోస్, గాంధీ కుటుంబాలు ఆర్థికంగా ఎలా ఉన్నాయో చూడండి.
అడవి బిడ్డల కోసం కొట్లాడిన కొమురం భీం మనుమడు పేదరికంలో ఉన్నారు. చాకలి ఐలమ్మ వారసులు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రజల కోసం కొట్లాడిన కుటుంబాలు ఆదర్శంగా ఉంటూ పేదరికంలో బతుకుతున్నారు..2001 కి ముందు కేసీఆర్ కు తొడుక్కోవడానికి చెప్పులు లేవు..ఇవాళ ఇన్ని లక్షల కోట్లు కేసీఆర్ కు ఎలా వచ్చాయి..? ” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 220 ఏండ్లు ఏలిన తరువాత నిజాం ధనవంతుడు అయ్యాడు..కానీ కేసీఆర్ పదేళ్లలో లక్షల కోట్లు సంపాదించారు. ఇలాంటి మీరా తెలంగాణ ఉద్యమకారులా? అని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “తెలంగాణ కోసం 1200 మంది ప్రాణత్యాగం చేస్తే ప్రభుత్వం గుర్తించింది కేవలం 528 మందిని మాత్రమే..తొమ్మిదేళ్లలో అమరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టారా? అసలు కేసీఆర్ మనీషా… మానవ రూపంలో ఉన్న మృగమా?మళ్లీ వెట్టి చాకిరి విధానం తీసుకురావాలని కేసీఆర్ చూస్తున్నారు.
ఆయన తరువాత కొడుకు..అటుపై మనుమడు వస్తడట. తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చాలని చూస్తున్నారు” అని విమర్శించారు. పేదల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లతోనే దళిత బిడ్డలు ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలో కేసీఆర్ చెప్పాలి…తెలంగాణ ఇచ్చినందుకా? పేదలకు రిజర్వేషన్లు ఇచ్చినందుకా? నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసగించిన కేసీఆర్ ను, ఆ పార్టీని బొంద పెట్టాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.