సంగారెడ్డి ప్రజలు కేసీఆర్ మాటలకు ఈ సారి మోసపోరు
: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప
హైదరాబాద్, జూన్ 23 : కెసిఆర్ మాటలకు మోస పోవడానికి సంగారెడ్డి జిల్లా ప్రజలు ఈసారి సిద్ధంగా లేరని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో సంగప్ప మాట్లాడుతూ కేసీఆర్ పటాన్ చేరు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పడం కెసిఆర్ నైజం అని మరోసారి రుజువైందని సంగప్ప అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రలో సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రకటించి ఇంకా ఎందుకు పనులు ప్రారంభిస్త లేరని నిలదీసినందుకు గతేడాది ఫిబ్రవరిలో నారాయణఖేడ్‌లో శంకుస్థాపన చేశారని సంగప్ప చెప్పారు. అయితే ఏడాదిన్నర అవుతున్న తట్ట మట్టి తీయ లేదని, గజం గుంత తవ్వ లేదని ఆయన ఆరోపించారు. పైగా హరీష్ రావు ఈ మధ్యకాలంలో మల్లోసారి శంకుస్థాపన పేరుతో హడావుడి చేసి మోసం చేసే ప్రయత్నం చేశారని సంగప్ప దుయ్యబట్టారు.
మామ ఒకసారి, అల్లుడు ఇంకోసారి శంకుస్థాపన చేస్తారు కానీ బడ్జెట్లో మాత్రం ఒక్క పైసా కేటాయించ లేదని సంగప్ప విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లోనే సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించే వారు అని, ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో ఈ ఎత్తి పోతల పథకం గురించి కనీస ప్రస్తావన కూడా చేయలేదని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క అభివృద్ధి అని కూడా జరగలేదని కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని సంగప్ప వివరించారు. నేడు సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయంటే ఆ క్రెడిట్ నరేంద్ర మోడీ గారిది అని చెప్పారు. సంగారెడ్డి – నాందేడ్ హైవే నిర్మాణం వల్ల తమ ప్రాంతంలో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయని ఆయన చెప్పారు. ఇందులో కేసీఆర్ పాత్ర ఏముందో చెప్పాలని సంగప్ప నిలదీశారు.
కేవలం సంగారెడ్డి జిల్లాలో సభ పెట్టి మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఈసారి సంగారెడ్డి జిల్లా ప్రజలు మోసపోవాదానికి సిద్ధంగా లేరని సంగప్ప చెప్పారు.
పటాన్ చేరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర గౌడ్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, విట్టల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.