పటాన్‌చెరులో రూ.200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
: మంత్రి హరీష్‌రావు
సంగారెడ్డి జూన్ 22 : పరిపాలన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తుంటే, దేశం అనుసరిస్తున్నదని మంత్రి హరీష్‌రావు అన్నారు. పటాన్‌చెరులో జరిగిన సీఎం కేసీఆర్ సభలో ఆయన మాట్లాడారు. దాదాపు రూ.200 కోట్ల ఖర్చుతో పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దాంతో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు పోవాల్సిన అవసరం తప్పుతుందన్నారు. వచ్చే ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.పటాన్ చెరులో గల్లీగల్లీ తిరిగిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.
కేసీఆర్‌కు 56 ఇంచుల ఛాతీ లేదుగానీ, ఎక్కడ ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలిసిన నాయకుడని కొనియాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణకు అవార్డుల పంట పండిందని చెప్పారు. అన్ని విభాగాల్లో మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో పటాన్ చెరులోని పరిశ్రమల్లో పవర్ హాలిడేలు ఉండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ కోతలు లేవని తెలిపారు.పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు కరెంట్ లేదని మంత్రి ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇస్తామని మాట ఇచ్చి హామీని నెరవేర్చారన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో 4 లక్షల ఎకరాలకు నీరు వస్తుందన్నారు. NIMZ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేసి జిల్లా యువతకు ఉపాధి కలిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవతో 70 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. సంగారెడ్డిలో 81 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుతున్నాయని చెప్పారు.