త్వరలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు
హైదరాబాద్, నిర్దేశం :
రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేసేలా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది ఈ క్రమంలో తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అర్హులను ఎంపిక చేసింది.
తొలి విడతలో ఇప్పటికే 72,045 మంది లబ్ధిదా రులకు అధికారులు ఇళ్లను మంజూరు చేశారు. ప్రస్తుతం అర్హుల లిస్టు ప్రకటించిన గ్రామాలను మినహాయించి మిగిలిన గ్రామాల్లో అర్హుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరి చేసేలా అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజాగా. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరిపై కీలక విషయాన్ని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త అందించారు. మరోవారం రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు.
అర్హులైన వారిని ఎంపిక చేసి, పనులు మొదలు పెడతామని అన్నారు. జాబితాలో పేర్లు రానివారికి ఆందోళన అవసరం లేదని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ. మరో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని చెప్పారు.
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పైనా మంత్రి శ్రీనివాస్ రెడ్డి కీలక విషయాన్ని చెప్పారు. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని సరిగ్గా 15నెలలు అవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.