అంతుచిక్కని వ్యాధితో 13 మంది మృతి
ఛత్తీస్‌గఢ్, నిర్దేశం:
రాష్ట్రంలో అంతుచిక్కని వ్యాధి కారణంగా సుక్మా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నెల రోజుల వ్యవధిలోనే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలోని 80 మంది బ్లడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న చిన్న గ్రామం ధనికొర్తలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామంలో దాదాపు ప్రతి ఇల్లూ ఈ వ్యాధికి ప్రభావితమైంది. ఈవ్యాధి కారణంగా ఇప్పటి వరకూ 13మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణానికి ఖచ్చితమైన కారణం మాత్రం తెలియరాలేదు. బాధితులంతా వారి మరణానికి ముందు తీవ్రమైన ఛాతీ నొప్పి, ని రంతర దగ్గుతో బాధపడినట్లు తెలిసింది. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు ఆ గ్రామానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 80మంది స్థానికుల బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఈ అంతుచిక్కని వ్యాధితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే సుక్మా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కపిల్ దేవ్ కశ్మప్ మాత్రం.. ఈ మధ్య కాలంలో ఐదు మరణాలే నమోదైనట్లు చెప్పారు. వృద్ధాప్య సంబంధిత కారణాలతో జిల్లా ఆసుపత్రిలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు తెలిపారు. మరో ఇద్దరి మరణాలకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.