పదో తరగతి పరీక్షలలో మార్పులు చేసిన తెలంగాణ విద్యాశాఖ కొత్త విధానంలో మోడల్ ప్రశ్నాపత్రాలను శుక్రవారం విడుదల చేసింది. టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ ప్రశ్నాపత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
పరీక్ష విధానంలో మార్పులను తెలుసుకోవడానికి ఈ పేపర్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. మార్చిలో పరీక్షలకు హాజరు కాబోయే పదో తరగతి విద్యార్థులు ఎస్‌సీఈఆర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి ఈ పరీక్ష పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
గతంలో వ్యాసరూప ప్రశ్నల సెక్షన్ లో ఇంటర్నల్ ఛాయిస్ ను విద్యాశాఖ ఈసారి తొలగించింది. ప్రత్యామ్నాయంగా ఛాయిస్ ప్రశ్నలను పెంచి వ్యాసరూప ప్రశ్నలను ఆరు చేశారు. అందులో నుంచి ఏవైనా నాలుగు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోయేలా మార్పులు చేశారు.
దీని ప్రకారం 80 మార్కులకు మోడల్ పేపర్లను రూపొందించారు. ఇంటర్నల్ ఛాయిస్ విధానాన్ని తీసేసి ఈ కొత్త పద్ధతిని అధికారులు ప్రవేశపెట్టారు. అయితే, తెలుగు, ఇంగ్లిష్, హిందీ.. తదితర లాంగ్వేజ్ లకు వర్తించదని చెప్పారు.
గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో ఈ కొత్త విధానంలో తయారుచేసిన ప్రశ్నాపత్రం ఇవ్వనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.