రాత్రికి రాత్రే సీఈసీ ఎంపిక చేయడం సరికాదంటున్న రాహుల్
న్యూఢిల్లీ, నిర్దేశం :
భారత ప్రధాన ఎన్నికల కమిషన్‌గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికైన కొద్ది గంటలకే ఎంపిక కమిటీలో సభ్యుడైన విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సీఈసీ ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తుం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం అగౌరవ ప్రదమైన చర్య అవుతుందన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాహుల్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సీఈసీ ఎంపిక కమిటీ సమావేశంలో మోదీ, అమిత్‌షాకు అభ్యంతరాల నివేదకను అందజేశాను. కార్యనిర్వాహక వర్గం జోక్యం లేని స్వతంత్ర ఎలక్షన్ కమిషన్‌లో ఎన్నికల సంఘం కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషన్‌ను ఎంపిక చేసే ప్రక్రియ కీలకం. ఎంపిక కమిటీ నుంచి సీజేఐను తొలగించడం ద్వారా మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది. ఇది ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై లక్షలాది మంది ఓటర్ల ఆందోళనకు కారణమవుతోంది అని రాహుల్ అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, జాతి నిర్మాతల సిద్ధాంతాలకు కట్టుబడటం, ప్రభుత్వాన్ని జవాబు దారీని చేయాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నేతగా తనకు ఉందని రాహుల్ చెప్పారు. కమిటీ కూర్పు, ప్రక్రియను సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పై మరో 48 గంటల్లోనే విచారణ జరగాల్సి ఉండగా రాత్రికి రాత్రి ప్రధాని హోం మంత్రి నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు.