నక్సల్స్ ఉద్యమం నుంచి రైతు సేవ వైపు అన్వేష్ ప్రయాణం..
ఎర్ర జెండా వదిలి.. అన్నదాతకు అండగా నిలిచి..
రైతు సేవ నాకు బోనస్ లైఫ్
-
రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
(యాటకర్ల మల్లేష్)
ఒకప్పుడు మావోయిస్టు నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆయన వాళ్లతో సంబంధాలు పెట్టుకున్నారు. నక్సల్స్ కార్యకలపాలను అణచడంలో భాగంగా ఆయన కోసం పోలీసులు గాలించారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే అడవిలోకి తీసుకెళ్లి ఎన్ కౌంటర్ పేర అంతం చేసేవారే. అయినా.. ప్రభుత్వానికి లొంగిపోయి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.
రైతుల కష్టాలపై స్పందించి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నిర్వహించిన అన్వేష్ రెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు. రైతు బిడ్డగా జీవితంలో కష్టాలు, నష్టాలు చూసిన తాను బ్రతికినంత కాలం పేదల కోసం పని చేస్తానని చెబుతున్నారు అన్వేష్.
నిర్దేశం : మీ ఉద్యమ ప్రస్థానం గురించి చెబుతారా..?
అన్వేష్ రెడ్డి : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామం. మా ఊళ్లో మావోయిస్టు నక్సల్స్ కార్యకలపాలు జోరుగా కొనసాగుతున్న కాలంలో నాకు వాళ్ల ఆశయాలు నచ్చాయి. వారి సాహిత్యం చదివాను. నిస్వార్థంగా పేదల కోసం పని చేస్తున్న నక్సల్స్ ఉద్యమం వైపు నా ఆలోచనలు వెళ్లాయి. అంతే.. మావోయిస్టు సిర్నాపల్లి, భీంగల్ దళాలతో సంబంధాలు పెట్టుకున్నాను. ఇది తెలిసి పోలీసులు నా కోసం గాలించడం ప్రారంభించారు.
నిర్దేశం : పోలీసులు గాలిస్తుంటే ఎలా తప్పించుకున్నావ్..?
అన్వేష్ రెడ్డి : నేను ఎలా ఉంటానో పోలీసులు గుర్తు పట్టేవారు కాదు.. నా ఫోటో కూడా వాళ్ల దగ్గర లేదు. సో.. నేను వాళ్ల నుంచి సులువుగా తప్పించుకున్నాను. అప్పట్లో నక్సల్స్ తో సంబందాలు పెట్టుకున్నోళ్లను పోలీసులు అరెస్టు చేసి కాల్చి చంపి ఎన్ కౌంటర్ లో మరణించారని చెప్పేవారు. క్షణక్షణం భయం భయంతో బతికే బదులు ఉద్యమ బాటలోనే ప్రాణాలు వదులాలని అనుకున్న రోజులున్నవి.
నిర్దేశం : నీవెప్పుడన్న పోలీసుల ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్నావా..?
అన్వేష్ రెడ్డి : పోలీసులకు చిక్కలేదు కాబట్టి బతికి ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఇది బోనస్ లైఫ్.. నాతో పాటు నక్సల్స్ తో సంబంధాలు పెట్టుకున్నోళ్లు చాలా మంది ఎన్ కౌంటర్ పేరిట హతమయ్యారు. ఉదాహరణకు సుంకెట్ కు చెందిన మంగళి గంగాధర్, సుధీర్ ఇంకా చాలా మంది అమరులయ్యారు. నాపై పోలీసులు పెట్టిన కేసులతో కోర్టుల చుట్టూ తిరుగలేక చాలా ఇబ్బందులు పడ్డ. లొంగిపోయిన నక్సల్స్ ను పోలీసులు వేధించడంతో, నేను అనుభవిస్తున్న కష్టాలను ప్రధాన పత్రికలకు లేఖ రాసి కొంత కాలం దుబాయ్ లో బతుకాల్సి వచ్చింది.
నిర్ధేశం : నక్సల్స్ ఉద్యమం వల్ల సమాజంలో ఏమైనా మార్పులు వచ్చాయా..?
అన్వేష్ రెడ్డి : ఒకప్పుడు పల్లెల్లో దొరల పెత్తనం ఉండేది. మాలీ పటెల్, పోలీసు పటెల్, కర్నంల పెత్తనం కొనసాగేది. భూస్వాములైతే ప్రజలను పీడించేవాళ్లు. కానీ.. నక్సల్స్ రాకతోనే వాళ్ల ఆరాచకాలకు అడ్డు కట్టపడ్డది. నక్సల్స్ వల్లనే గ్రామీణ ప్రాంత ప్రజలలో చాలా మార్పులు వచ్చాయి. అంతేందుకు, నక్సల్స్ మా ఊళ్లేకు రాక ముందు అంటరానితనం ఉండేది. హోటల్ లలో దళితులకు సపరేట్ గ్లాసులు ఉండేవి. మాలాంటోళ్ల ఇళ్లకు దళితులు రాని పరిస్థితి. అదే దళితులు ఇళ్లలోకి వచ్చి మాతో సమానంగా కూర్చుండి భోజనాలు చేస్తున్నారంటే నక్సల్స్ వల్లే.. నిజానికి అమరవీరుల త్యాగాల ఫలితం వల్లే తెలంగాణాలో భూసంస్కరణలు వచ్చాయి. మనిషిని మనిషిగా గుర్తించే పరిస్థితి వచ్చింది. దున్నే వానికి భూమి కావాలని నక్సల్స్ చేసిన ఉద్యమాలు చరిత్రలో నిలుస్తాయి. వాళ్ల ఉద్యమం వల్లే తునికాకు ధర పెరిగింది. పల్లెల్లో సారాయి కనిపించకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తప్పు చేయాలంటే భయపడే రోజులవి.
నిర్దేశం : నక్సలైట్ బాట నుంచి కాంగ్రెస్ బాట వైపు రావడానికి కారణాలు ఏమిటీ..?
అన్వేష్ రెడ్డి : పోలీసు నిర్బంధం పెరిగింది. వ్యక్తిగత కారణాలతో నేను జనజీవన స్రవంతిలో కలిశాను. అయినా.. పోలీసుల వేదింపులు తగ్గలేదు. సమాజానికి ఏదో చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాను. కోదండ రెడ్డి సహాకారంతో రాష్ట్ర కాంగ్రెస్ రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. ఒక సందర్భంలో మాజీ నక్సలైట్ గా పీడీ యాక్ట్ పెట్టి జైలులో వేస్తామని పోలీసులతో ప్రభుత్వం బెదిరించింది. అయినా… భయపడకుండా రైతుల పక్షాణ నిలిచాను.
నిర్దేశం : రైతు ఉద్యమాలు చేయడానికి స్ఫూర్తి ఎవరు..?
అన్వేష్ రెడ్డి : ఇంకెవరూ, నక్సలైట్లే.. నేను ఇలా కమిట్మెంట్ గా రైతుల పక్షన పని చేస్తున్న అంటే ఉద్యమంలో నేను నేర్చుకున్న పాఠాలే.. 2015 లో నిజామాబాద్ జిల్లా రైతాంగ సమస్యల పరిస్కారం కోసం ఉద్యమాలు చేస్తే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది. అయినా.. నక్సల్స్ ఉద్యమ స్పూర్తితో రైతుల పక్షాన ప్రజా క్షేత్రంలో కొట్లాడాలని నిర్ణయించుకున్న. అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ భట్టి విక్రమార్క సహకారంతో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా రైతుల పక్షాన నిలబడ్డ. భట్టి విక్రమార్క ప్రోత్సాహంతో కిసాన్ కాంగ్రెస్ నిర్మాణం బలోపేతం చేస్తూ మరింత రెట్టింపు ఉత్సాహంతో రైతుల పక్షన నిలబడ్డ. రైతుల పక్షణ చేస్తున్న పోరాటాలను చూసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం 2019 తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చింది.
నిర్దేశం : రైతు ఉద్యమంలో మరిచి పోలేని ఘటనలు ఏంటి..?
అన్వేష్ రెడ్డి : 2019 లోనే నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్నల మద్దతు ధర కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపిన సందర్భంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్న. కేసీఆర్ ప్రభుత్వం నాపై కక్ష గట్టి జైలులో పెట్టింది. రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నానని అప్పటి సీఎం కేసీఆర్ నా పేరు కూడా శాసన సభలో ప్రస్తావించాడు. అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో రైతుల గోడును దేశ వ్యాప్తంగా తెలియ చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ కూతురు కవిత (సిట్టింగ్ ఎంపీ)పై నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి 176 మంది రైతులతో నామినేషన్ వేయించి పోటీలో పెట్టాం. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను సంఘటితం చేయడంలో కాంగ్రెస్ కిసాన్ విభాగానిది కీకల పాత్ర.
నిర్దేశం : తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎలా ఉంది..?
అన్వేష్ రెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది. రైతు బిడ్డగా వాళ్ల బాధలు తెలిసిన నాకు రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం వల్ల రైతులకు మరింతా సేవలందించే అవకాశం కలిగింది.
నిర్దేశం : రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా రైతుల కోసం ఏమి చేస్తున్నారు?
అన్వేష్ రెడ్డి : రైతుల పక్షాణ ఉద్యమాలు చేసిన నా మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత పెట్టారు. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా రైతులకు మరింతా సేవలందించి ప్రభుత్వానికి గుర్తింపు తేవడమే నా ముందున్న లక్ష్యం. గత పది సంవత్సరాలుగా విత్తనాభివృద్ధి సంస్థను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతులకు సంస్థకు దూరాన్ని పెంచింది. తిరిగి విత్తనాభివృద్ది సంస్థ ను రైతులకు దగ్గర చేయాలి. రైతులకు పెద్ద మొత్తంలో నాణ్యమైన విత్తనాలు అందించాలి.
నిర్దేశం : రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా…?
అన్వేష్ రెడ్డి : నక్సల్స్ ఉద్యమంలో పని చేయడం వలన నాలో ప్రజలకు సేవ చేయాలనే తపన ఒక అంకిత భావం ఏర్పడ్డది. కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన రైతుల సంక్షేమం కోసం సేవ చేసే అదృష్టం నాకు లభించింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందివ్వడమే నా ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేసింది. మరో మారు రైతులకు రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఈ జీవితం బోనస్.. జీవితాంతం రైతులకు అండగా ఉంటాను.
యాటకర్ల మల్లేష్