బీజేపీ, కాంగ్రెస్ లకు చెమటలు పట్టిస్తున్న బీఎస్పీ
– మొదటి సారిగా తెలంగాణలో జాతీయ పార్టీల మధ్యనే పోటీ
– పోటీ చేయలేక ఎన్నికల నుంచి తప్పుకున్న బీఆర్ఎస్
– ఊహించని స్థాయిలో బీఎస్పీ అభ్యర్థుల ప్రచారం
– టీచర్ ఎమ్మెల్సీలో దూసుకుపోతున్న సాయన్న
– గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలో గెలుపు దిశగా హరికృష్ణ
నిర్దేశం, కరీంనగర్ః
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విధంగా బహుజన్ సమాజ్ పార్టీ సత్తా చాటుతోంది. రెండు అధికార పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు బీఎస్పీ చెమటలు పట్టిస్తోంది. వరంగల్-నల్గొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ బరిలో బీఎస్పీ అభ్యర్థి లేరు. కానీ, కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ ఉమ్మడి జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ (ఒకటి టీచర్, మరొకటి గ్రాడ్యూయెట్) స్థానాలకు బీఎస్పీ అభ్యర్థులను నిలబెట్టింది. కాగా, ఈ రెండు సెగ్మెంట్లలో బీఎస్పీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. తెలంగాణలో బీఎస్పీ ఈ స్థాయిలో పోటీని ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ కొనసాగుతోంది.
బీజేపీకి చెమలు పట్టిస్తున్న సాయన్న
కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ టీచర్ ఎమ్మెల్సీ బరిలో బీఎస్పీ నుంచి యాటకారి సాయన్న ఉన్నారు. ఈ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కొమురయ్య ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కాగా, ఆయనకు కాంగ్రెస్ ఎంత మాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. బీజేపీకి బీఎస్పీ అభ్యర్థి సాయన్న సవాలుగా మారారు. నిజానికి ఉత్తర తెలంగాణలో బీఎస్పీ అంతర్గతంగా బలంగానే ఉంటుంది. అయితే, గతంలో రకరకాల కారణాలతో ఓటర్లు సైలెంట్ గా ఉన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం తమ సత్తా చాటుతున్నారు. దీనికి తోడు సాయన్న లాంటి బలమైన లీడర్ పోటీలో ఉండడం క్యాడర్ లో కొంత జోష్ పెరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని దాటేసి బహుజన్ సమాజ్ పార్టీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది.
గెలుపు దిశగా ప్రసన్న హరికృష్ణ
ఇక కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యూయేట్ ఎన్నిక మరోలా ఉంది. ఈ స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుపు వైపుకు దూసుకుపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఏకంగా అధికార పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని హరికృష్ణ వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది. యువత బీఎస్పీవైపే చూస్తున్నారు. దీనికితోడు హరికృష్ణకు ఉన్న క్రెడిబిలిటీ గెలుపు వరకు తీసుకెళ్తోందని సర్వేల్లో వెల్లడైంది. ఈ స్థానంలో బీజేపీ కనీసమైనా కనిపించకపోవడం గమనార్హం.
మొదటి సారి జాతీయ పార్టీల మధ్యే పోటీ
చిత్రంగా.. తెలుగు నేల మీద మొదటిసారి జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో స్థానిక పార్టీ పోటీలో లేకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ పక్కకు తప్పుకోగా.. మిగతా పార్టీలు ఎన్నికల్లో దిగేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీల మధ్యే పోటీ నెలకొంది. మరీ విచిత్రంగా రెండు స్థానాల్లో బీఎస్పీ బలంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కో స్థానంలోనే బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీసీల్లో పెరుగుతున్న ఆలోచనణలను పసిగట్టి వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది బీఎస్పీ. ఇది ఆ పార్టీకి బాగా కలిసి వచ్చిందని అంటున్నారు.
పోటీ చేయలేక చతికిల పడ్డ బీఆర్ఎస్
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోగా.. సగం స్థానాల్లో డిపాజిట్ కూడా కోల్పోయిన బీఆర్ఎస్ కు.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దడ పుట్టుకుంది. ఇక్కడ కూడా డిపాజిట్ రాకపోతే, ఇక కారును షెడ్డుకే పంపించాల్సి వస్తుందని ఎన్నికలకు దూరంగా ఉన్నారు కేసీఆర్. బహుశా.. ఇలా దూరం ఉండడం కూడా ఆ పార్టీకే మైనసే. కనీసం చర్చలో లేకుండా పోయింది ఆ పార్టీ. చాలా మంది పార్టీ గురించి మాట్లాడటం మానేశారు. ఇలా మరోసారి జరిగితే పార్టీనే మర్చిపోతారు.