కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన ‘‘ఎమ్మెల్సీ’’ ఎన్నికల రిజల్ట్
స్వయంకృతాపరాదంతోనే ఓటమి
– గ్రూప్ రాజకీయాలతోనే కాంగ్రెస్ కు నష్టం..
– డీఎస్పీ గంగాధర్ ను ఎన్నికలకు దూరం ఉంచడమూ ముంచింది.. .
– క్షేత్రస్థాయిలో కానరాని సమన్వయం
– కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం శూన్యం..
– బీజేపీ క్యాడర్ లో పెరిగిన ఆత్మవిశ్వాసం..
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్… రాష్ట్రంలో అధికారంలో ఉండి గెలుపు నల్లేరు మీద బండి నడకలా భావించిన కాంగ్రెస్ నేతలకు ఊహించని దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారం చేసినా.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా ఎన్నికలపై దృష్టి పెట్టినా.. విద్యావంతులు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జీగా విచ్చేసిన మీనాక్షి నటరాజన్ కు ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ వ్యతిరేకంగా ఇస్తూ కాంగ్రెస్ పెద్దలు ఘన స్వాగతం పలికారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)
ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఓడి పోవడానికి కారణాలను విశ్లేషించుకుంటుంది. కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఘోరంగా ఓడి పోవడానికి ఆ పార్టీలోని గ్రూప్ రాజకీయాలు.. క్షేత్ర స్థాయిలో సమన్వయం లేక పోవడం కారణంగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీకి డ్యామేజ్ చేస్తూ ప్రకటనలు ఇస్తే కఠినంగా శిక్షిస్తామని పార్టీ వ్యవహరాల ఇన్ ఇచార్జీ మీనాక్షి నటరాజన్ హెచ్చరించిన సందర్భంలో రెండు ఎమ్మెల్సీలలో బీజేపీ గెలవడం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జీర్ణించుకోలేక పోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడి పోవడానికి కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాదం కారణంగా కనిపిస్తోంది.
ఎన్నికలపై గ్రూప్ రాజకీయాల ప్రభావం
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడి పోవడంలో గ్రూప్ రాజకీయాలే ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పటిష్ట కోసం రాత్రింబవళ్లు కష్ట పడుతున్నప్పటికీ మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తం కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గ్రూప్ రాజకీయాలలో రెండు చోట్ల బీజేపీ గెలుపు అనివార్యమైందని చెబుతున్నారు. ఎన్నికలకు ముందే సర్వేలు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డీఎస్పీ గంగాధర్ తో నామినేషన్ విరమించారు. అప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి తన దైన శైలిలో నాలుగు ఉమ్మడి జిల్లాలలోని 42 నియోజక వర్గలలో మంచి పట్టు సాధించిన గంగాధర్ ను ఎన్నికలలో ఉపయోగించుకోక పోవడం మరో కారణంగా కనిపిస్తోంది. నామినేషన్ విరమించుకున్న తరువాత కాంగ్రెస్ పెద్దలు తనను ఉపయోగించుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాలను మంత్రి శ్రీధర్ బాబు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
క్షేత్ర స్థాయిలో సమన్వయ లోపం..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల తన గెలుపు సులువుగా కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి క్షేత్ర స్థాయిలో క్యాడర్ ను నిర్లక్ష్యం చేయడమే.. సీటు కోసం కాంగ్రెస్ పెద్దలకు కోట్లు ఇచ్చానని పరోక్షకంగా సన్నిహీతులతో చర్చించిన ఆయన తన గెలుపు కోసం పార్టీ పెద్దలే చూసుకుంటారని అహంకారానికి పోయారనేది మరో వాదన.
అధికారంలో ఉండి ఓటమి..
ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెగ్గిన కాంగ్రెస్‌కు ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎదురుదెబ్బ తగిలింది. సిటింగ్ స్థానం కావడం… రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున తప్పనిసరిగా గెలిచి తీరాలని అధిష్ఠానం పీసీసీకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశర చేసినా చివరికి ఓటమి తప్పలేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు, పీసీసీ కార్యవర్గంలో పదవుల పంపకం ఉంటుంది కాబట్టి ఆశావహులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తారని తొలుత అందరూ భావించారు. కానీ వారు కూడా పెద్దగా క్షేత్రస్థాయిలో తిరగలేదు.
పీసీసీ చీఫ్ కు చెంపదెబ్బ..
పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి ఎన్నికలలో ఒక ఎమ్మెల్సీ గెలువక పోవడం ఆయనకు చెంపదెబ్బలా పరిణమించింది. ఒకవైపు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్‌లో సైతం నేతలు సరిగా పనిచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్ల దగ్గరకు వెళ్లి చెప్పి ఆకట్టుకోలేకపోయారు. ఓటర్లంతా పట్టభద్రులు కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ప్రత్యర్థులు సోషల్ విూడియాలో ప్రచారాన్ని ప్రధాన అస్త్రంగా వినియోగించుకుంటే కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో పట్టనట్లు వ్యవహరించారనే విమర్శలున్నాయి.
గంగాధర్ ను కాదని తప్పు చేశారా?
నిజానికి.. నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చే సమయం నాటికే ప్రస్తుతం బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ, డీఎస్పీ గంగాధర్ లు రేసులో ఉన్నారు. హరికృష్ణ కాస్త తొందరగానే ఈ ఆశలు వదులుకుని బీఎస్పీ వైపు వెళ్లినప్పటికీ.. గంగాధర్ మాత్రం కాంగ్రెస్ మీద విశ్వాసం ఉంచారు. టికెట్ నరేందర్ రెడ్డికి పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పిలవగానే వెళ్లి నామినేషన్ వదులుకున్నారు. అయినప్పటికీ గంగాధర్ లాంటి విశ్వాసుడిని కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఎన్నికలంటే మంది, మందు అన్న భ్రమనే ఉంది కాబోలు. గంగాధర్ లాంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తిని వదులుకోవడం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పెద్ద విపత్తుగా పరిణమించింది.
బీజేపీ క్యాడర్ లో పెరిగిన ఆత్మవిశ్వాసం..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యలు విజయం సాధించడంతో బీజేపీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీల విజయోత్సవం నిర్వహించారు. రాబోయే కాలంలో తామే అధికారంలోకి వస్తున్నామనే సందేశాన్ని విద్యావంతులు ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
క్షేత్ర స్థాయిలో మీనాక్షి నటరాజన్ విచారణ చేస్తే..
కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్లుగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినడానికి అనేక కారణాలతో పాటు గ్రూప్ రాజకీయాలు ప్రధాన పాత్ర పోషించాయానేది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వ్యవహాల ఇచ్ చార్జీ మీనాక్షి నటరాజన్ క్షేత్ర స్థాయిలో తెలుసుకోకుంటే భవిష్యత్ లో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు.