వేధించిన యువకులు.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి విద్యార్థిని మృతి
చండీఘడ్, నిర్దేశం:
దేశంలో రోజుకు ఎక్కడో ఒకచోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హర్యానాలో 12వ తరగతి చదువుతున్న అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిరది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గన్నౌర్‌లో చోటుచేసుకున్నది. తమ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లైంగికంగా వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితురాలి తండ్రి తెలిపాడు. ఖాన్‌పూర్ కలా న్‌లో ఉన్న భగత్ పూల్ సింగ్ మెడికల్ కాలేజీకి ఆ అమ్మాయి మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కోసం జీఆర్పీ పోలీసులు తరలించారు. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఆ ముగ్గుర్నీ విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒకర్ని అరెస్టు చేశారు. తుషార్ అనే వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. గన్నౌరు నుంచి బో ద్వాల్ మజ్రీ రైల్వే స్టేషన్ల మధ్య రైలు ముందు దూకి విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్‌హెచ్‌వో జోగిందర్ సింగ్ తెలిపారు. విద్యార్థిని మృతదేహాన్ని ఆమె కుటుంబీకులు గుర్తించారు. తుషార్, కమల్, మంజీత్ అనే ముగ్గురు యువకులు తన కూతుర్ని లైంగికంగా వేధించినట్లు తండ్రి పేర్కొన్నారు. వేధింపులు తట్టుకోలేక తన కూతురు సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి తన ఫిర్యాదులో తెలిపాడు. ఐపీసీ, పోక్సో చట్టాల ప్రకారం కేసును నమోదు చేశారు. ఆధార్ కార్డు ప్రకారం బాధితురాలి వయసు 18 ఏళ్లు ఉందని, అంటే ఈ కేసులో పోక్సో చట్టం వర్తించకపోవచ్చు అని గన్నౌరు జీఆర్పీ సురేశ్ కుమార్ తెలిపారు.