ఆయన రేప్ చేసాడు..
ఔను.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
వధువు అత్తిగారింటికి.. వరుడు జైలుకు వెల్లాడు..
నిర్దేశం, భువనేశ్వర్ :
పెళ్లి అంటే నూరేళ్ల పంట.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సంతోషకరమైన వేడుక.. కానీ.. అందమైన ఓ యువతిని చూసిన ఆ యువకుడు రేప్ చేసాడు.. అంతే.. ఆయన ఇప్పుడు అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అరెస్ట్ అయి జైల్లో ఉండగా.. అతడు తన తప్పును తెలుసుకున్నాడు. ముఖ్యంగా బాధితురాలినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇదే విషయాన్ని అక్కడి జైలు అధికారులకు చెప్పగా, అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. దీంతో జైలునే పెళ్లి మండపంగా మార్చేసి.. అక్కడే వీరిద్దరికీ వివాహం జరిపించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, పోలీసుల నడుమే.. నిందితుడు బాధితురాలి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆపై వధువు అత్తారింటికి వెళ్లగా.. వరుడు మాత్రం జైలుకి వెళ్లాడు.
—-
ఒడిశాలోని గంజాం జిల్లా గొచ్చబడి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సూర్యకాంత్ బెహెరా.. అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. నీకోసం ఏమైనా చేస్తానని చెబుతూ.. ఆమె చుట్టూనే తిరిగాడు. ఆమెకు కూడా ఇతడు నచ్చగా ఓకే చెప్పింది. ఇక ఆపై ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని శారీరకంగా కూడా కలిశారు. ఇలా చాలా సార్లే చాటుమాటుగా కలుస్తూ ఎంజాయ్ చేయగా.. ఎన్నాళ్లు ఇలాగే ఉంటామని యువతి పెళ్లి చేసుకుందామని అడిగింది. కానీ సూర్యకాంత్ మాత్రం పెళ్లి వద్దని తెగేసి చెప్పాడు. నిన్ను చేసుకోనంటూ వివరించాడు. దీంతో ఆ అమ్మాయి షాక్ అయ్యింది. శారీరకంగా వాడుకున్న తర్వాత పెళ్లికి నో చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. పెళ్లంటూ చేసుకుంటే అతడిని చేసుకుంటానని వివరించింది. తప్పు చేసింది అతడే కాబట్టి శిక్ష కూడా అతడికే పడాలని 2024 నవంబర్ నెలలో పోలీసులను ఆశ్రయించింది. తనకు సూర్యకాంత్ చేసిన అన్యాయం గురించి వివరించి అత్యాచారం కింద కేసు పెట్టింది. దీంతో పోలీసులు సూర్యకాంత్ బెహరాను అరెస్ట్ చేశారు. కోడెలలోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఇప్పటికీ అతడు అక్కడే ఉండగా.. అతడి తల్లిదండ్రులు మాత్రం కుమారుడు జైల్లో ఉండడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఈక్రమంలోనే సూర్యకాంత్‌ని కలిసి.. నువ్వు చేసింది తప్పే కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో అని వివరించారు. ఇక చేసేదేమీ లేక తల్లిదండ్రులు చెప్పినట్లుగా బాధితురాలినే పెళ్లి చేసుకుంటానని సూర్యకాంత్ వివరించాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బాధితురాలి ఇంటికెళ్లి మాట్లాడారు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, కేసు వాపసు తీసుకోమన్నారు. అయితే వారిపై నమ్మకం లేని అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లయ్యాకే కేసు వెనక్కి తీసుకుంటామన్నారు. దీంతో జైల్లోనే పెళ్లి జరిపిద్దామని రాజీకి వచ్చారు. ఇదే విషయాన్ని అక్కడి జైలు అధికారులకు చెప్పగా.. వారు కూడా పెళ్లి జరిపించడానికి ఓకే చెప్పారు. జైల్లోనే వివాహం ఉంటుందని.. ఏర్పాట్లన్నీ తామే చేస్తామన్నారు. ఇలా మంగళవారం రోజు వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా.. వధువు సహా ఆమె తల్లిదండ్రులు, వరుడి తల్లిదండ్రులు జైలుకి వచ్చారు.అప్పటికే ఏర్పాట్లన్నీ చేసి ఉండగా.. పోలీసులు, తల్లిదండ్రుల ఎదుటే సూర్యకాంత్ బాధితురాలి మెడలో తాళి కట్టాడు. ఆపై జైలు అధికారులు సహా తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా వీరిద్దరి పెళ్లి అయిపోగా.. సూర్యకాంత్ జైలుకి వెళ్లగా.. అమ్మాయి
మాత్రం అత్తారింటికి వెళ్లింది. త్వరలోనే తమ కుమారుడు జైలు నుంచి బయటకు వచ్చి.. తన కోడలితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడని, పిల్లాపాపలతో హాయిగా ఉంటాడని సూర్యకాంత్ తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు.