నిర్దేశం, వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల లెక్కింపు ముగింపుకు వచ్చింది. తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమైంది. ఇప్పటికే ఆయన అధ్యక్ష హోదాలో అధికారిక ప్రసంగాలు ప్రారంభించారు. డెమొక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి దిగిన కమలా హారిస్ ఓటమి పాలయ్యారు. నిజానికి, అమెరికాలో మహిళలు ఓడుతూనే ఉంటారు. టెక్నాలజీలో, ఆధునికతలో ముందుండడమే కాదు.. ప్రపంచానికి నేర్పించే అమెరికాలో ఇప్పటి వరకు ఒక మహిళ అధ్యక్షులు కాకపోవడం అత్యంత విచారకరం. మహిళలకు ఏమాత్రం స్వేచ్ఛ లేని ఇస్లాం దేశాల్లో కూడా మహిళలు ప్రధానులో అధ్యక్షులో అవుతుంటే అమెరికాలో ఇప్పటికీ మహిళలు ఆ కుర్చీని అందుకోకపోవడం గమనార్హం.
మొదటి నామినేషన్ తిరస్కరణ
1884 ఎన్నికల్లో అబిగేల్ స్కాట్ అనే మహిళ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా.. ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత 1924లో మొదటిసారి కోరా విల్సన్ స్టేవార్ట్ అనే మహిళ పోటీకి దిగగా ఆమెకు కేవలం 16 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధ్యక్షులు అంటే కేవలం మగవారే అన్నట్లుగా అమెరికన్లు భావిస్తున్నారు. ఇక్కడ దారుణం ఏంటంటే.. మహిళా అభ్యర్థులకు మహిళల నుంచి కూడా మద్దతు లభించడం లేదు. మొదటిసారి 2016లో హిల్లరీ క్లింటన్ ప్రధాన అభ్యర్థిగా కనిపించారు. ట్రంప్ తో పోటీ పడి 6.5 కోట్ల ఓట్లు సాధించారు. నిజానికి ఆ ఎన్నికల్లో హారిస్ కే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. ఎలక్టోరల్ ఓట్ల(మన దగ్గర సీట్లు)లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. దీంతో, అందినట్టే అందిన అధ్యక్ష పదవి చేజారిపోయింది.
మహిళలను అభ్యర్థుగానే చూడడం లేదు
అమెరికాలో మహిళలను అధ్యక్షులుగా చూడడం అటుంచితే.. అసలు వారిని అభ్యర్థులుగానే చూడడం లేదు. దేశంలో అధికార కుర్చీని పంచుకుంటున్న డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు మహిళలను అభ్యర్థులుగా పెట్టలేదు. 2016లో డెమొక్రటిక్ పార్టీ ధైర్యం చేసి హిల్లరీని అభ్యర్థిగా నిలిపింది. రెండోసారి కూడా అదే పార్టీ కమలను అభ్యర్థిగా నిలిపింది. కానీ, రెండు సార్లు ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లో కూడా కమలతో సహా మొత్తం 11 మంది మహిళలు అమెరికా అధ్యక్ష బరిలో నిలిచారు. కమల మినహా ఆ అభ్యర్థులు ఎవరో అమెరికన్లకు కూడా తెలియని పరిస్థితి.
అమెరికా సంప్రదాయం అలాగే ఏడ్చింది
అమెరికాకు అధ్యక్షులయ్యేది మగవారేనని అమెరికన్లు గట్టిగా నిర్ణయించేసుకున్నారు. అందుకే అధ్యక్షుడిని ఫస్ట్ పర్సన్ అంటారు. ఆయన భార్యను ఫస్ట్ లేడి అంటారు. 2020 ఎన్నికల్లో కమలా హారిస్ తొలిసారి అమెరికా ఉపాధ్యక్షురాలు అయ్యారు. అప్పుడు ఆమెను ఏమనాలనే సంశయంలో పడింది అమెరికా. ఫస్ట్ లేడీ ట్యాగ్ అమెరికా అధ్యక్షుడి భార్యకు ఇవ్వాలా, అమెరికా ఉపాధ్యక్షురాలికి ఇవ్వాలా అని కొంత కాలం చర్చ జరిగింది. ఎట్టకేలకు పాతవిధానంలోకే తీసుకెళ్లి ఉపాధ్యక్షురాలిగా గెలిచినప్పటికీ కమల సెకండ్ లేడీగానే మిగిలింది.
అమెరికా అధ్యక్ష పదవి పక్కన పెడితే.. ఉపాధ్యక్షులుగా కూడా మహిళలు గెలవలేకపోయారు. 2020 ఎన్నికల్లో కమలా హారిస్ మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా గెలిచారు. అంతకు ముందు పోటీలో ఉన్నప్పటికీ వారి అడ్రస్ కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్య దేశంలో ఒక మహిళ ఉపాధ్యక్షురాలు కావడానికే 150 ఏళ్లు పట్టింది. ఇక అధ్యక్ష పదవి వరకు రావాలంటే మరో శతాబ్దం పడుతుందేమో.