– కండువాలు కప్పడంలో చతికిలబడ్డ బీజేపీ
– చిత్రంగా ఫిరాయింపులపై కమల నేతల విమర్శలు
– అధ్యక్ష పదవిపై అంతర్గత కుమ్ములాటే ఆపేస్తోంది
నిర్దేశం, హైదరాబాద్ః గెలిచిన వాడెవడూ ఊరికే ఉండడు. అయితే గెలుపును ఊరంతా ప్రచారం చేసుకుంటూ అయినా తారుగుతాడు, లేదంటే ఓడిన వాడిని వాడి దారికి తెచ్చుకోవడంలోనైనా బిజీగా ఉంటాడు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ పనిలో దూకుడుగానే ఉంది. ఎటొచ్చీ భారతీయ జనతా పార్టీనే చడీచప్పుడు కాకుండా కనిపించడం గమనార్హం. అసెంబ్లీలో 8 సీట్లతో మంచి మార్కులే సంపాదించిన కమల పార్టీ.. లోక్ సభ అధికార విపక్షాలను తలదన్ని 8 సీట్లు కైవసం చేసుకుంది. దీనికి తోడు కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి కూడా పంజా విసరకుండా, విసనకర్ర ఊపుతూ కూర్చోవడం బయటి వారికే కాదు, పార్టీలోని వారికి కూడా అంతు చిక్కడం లేదు.
కాంగ్రెస్ అలవాటు బీజేపీకి వచ్చిందా?
కాంగ్రెస్ పార్టీలో ఒక అలవాటు ఉంటుంది. బయటి వారితో వార్ కంటే అంతర్గత కుమ్ములాటలే ఎక్కువుంటాయి. అంటే కాంగ్రెస్ వర్సెస్ ఇంకెవరో కాకుండా.. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నమాట. బీజేపీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా అధ్యక్ష పదవి మీద వచ్చిన పేచీ అంటున్నారు కమల నేతలు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదట. ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, మహేశ్వర్ రెడ్డి లాంటి నేతలు అధ్యక్ష పదవి కోసం పోటాపోటీగా ఉన్నారు. వీరి మధ్య కుమ్ములాటలకే టైం సరిపోవడం లేదు. తమలో తామే కొట్టుకు చస్తుంటే, బయటి వారినెప్పుడు పట్టించుకునేది అని పార్టీ నేతలే అంటున్నారట.
బీజీపీ నేతల కవరింగ్
ప్రస్తుత సస్పెన్స్ మీద బహిరంగ రహస్యాలు స్వైర విహారం చేస్తున్నాయి. అయితే ఇది వ్యూహాత్మకమైన నిర్ణయమని కమల నేతలు కవర్ చేసుకుంటూ ఉండడం విశేషం. ఇంకా చిత్రంగా ఫిరాయింపులపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండడం మరీ విడ్డూరం. ఈమధ్య కాలంలో ఫిరాయింపులపై ఎక్కువ విమర్శలు ఎదుర్కున్నది బీజీపీనే. అయితే రాష్ట్రంలో ఆపరేషన్ కమలం ఐసీయూ నుంచి బయటికి రావడం లేదు. ఈ బలహీనతపై చర్చ జరిగితే పరువు పోతుందని, తాము నీతివంతులమని ప్రచారం చేసుకోవడమేనని వేరే చెప్పనక్కర్లేదు.
అసెంబ్లీ సీన్ మారుతుందా?
ఇంత జరుగుతున్నా.. బీజేపీకి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. బీఆర్ఎస్ నేతల్ని కనుక కాంగ్రెస్ పూర్తిగా లాగేస్తే ప్రతిపక్ష పార్టీగా బీజేపీకి అవకాశం లభిస్తుంది. బీజేపీ నేతల్ని లాగే ప్రయత్నం అయితే ఎవరూ చేయరు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న కమల పార్టీ.. తొలిసారిగా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం రానే రావచ్చు కూడా. పైగా కాంగ్రెస్ విపక్షంగా ఉంటే బీజేపీకి చాలా కలిసి వస్తుంది. కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉంటే బీజేపీ అక్కడ బలపడుతుంది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇది మెల్లిమెల్లిగా బీజేపీకి లాభం చేకూరొచ్చు.