అతను నోరు విప్పితే నవ్వులే..
– పదేళ్లు మంత్రిగా చేసినా అంతే..
అతను ఏది మాట్లాడినా నవ్వుకోవాల్సిందే.. ఏమి చేసినా నవ్వు కోవాల్సిందే.. అతను సాదాసీదా మనిషి కాదు. పదేళ్లు మంత్రి పదవి నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఔను.. అతను చేసేది ప్రతిది తీన్మార్ పనులే.. నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఆయన నైజం. మిగతావాళ్లు ఏమనుకున్నా ఆయన పెద్దగా పట్టించుకోరు. మాట్లాడిన ప్రతీ పదం వెనుక ఆయన నవ్వడం చాలామందికి అనుమానాలుంటాయి. నిజంగా అంటున్నారా? లేక కావాలనే అంటున్నారా? లేకపోతే జోష్ నింపాలని భావిస్తారా? ఇలా రకరకాల అనుమానాలు లేకపోలేదు.
కాకపోతే సోషల్ మీడియాలో ట్రెండ్ అయితేనే ఆయన నోరు విప్పుతారు. మామూలుగా నిత్యం వార్తల్లోకి ఉండేందుకు పరితపిస్తారాయన. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలామంది నేతలు కారు దిగిపోయారు. మారిన రాజకీయాలకు అనుగుణంగా వెళ్లకుంటే తమకు లైఫ్ ఉండదని భావించి జంప్ అయిపోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కూడా కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సెలర్ల వంతైంది. దాదాపుగా కారు పార్టీ వీకైందని షెడ్ లోకి వెళ్లిందని ఆ పార్టీ నేతలే బలంగా చెబుతున్నారు.
బీఆర్ఎస్‌లో ముఖ్యనేతల వ్యవహారశైలి వల్లే పార్టీలు మారుతున్నారని దుమ్మెత్తి పోస్తున్న వాళ్లూ లేకపోలేదు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. బీఆర్ఎస్ నుంచి చాలామంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి తానే పంపించానని ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసేసుకున్నారు.
అంతేకాదు కాంగ్రెస్‌లో ఉంటూ కారు కోసం కష్టపడతారని మనసులోని మాటను బయటపెట్టారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. విచిత్రం ఏంటంటే పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారాయన. మల్లన్న మాటలపై ఆ పార్టీలోని నేతలే రుసరుసలాడుతున్నారు.
ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఎవరైనా అందులో ఉంటారా? ఈ లాజిక్‌ను మాజీ మంత్రి ఎలా మరిచిపోయారని అంటున్నారు. ఏదో కార్యకర్తల్లో హుషారు కోసం అలాగని చెప్పి ఉంటారని చెబుతున్నారు. ఇంకా నయం.. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా తానే పంపించానని మల్లారెడ్డి అనలేదని అంటున్నారు పలువురు నేతలు. మొత్తానికి మల్లారెడ్డి వ్యాఖ్యలు విన్నవాళ్లు మాత్రం ఖుషీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇటీవల మల్కాజిగిరి నుంచి ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రెడ్డి గెలుస్తున్నాడని స్వయంగా అతనితోనే వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఏదో సరదాగా అన్నమాటలు కూడా ఒక్కోసారి మెడకు చుట్టుకుంటాయని పెద్దాయనకు బాగా తెలుసు. కాకపోతే మాటలతో మాయ చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.