హెచ్ సీ యూ లో ఏం జరుగుతోంది
హైదరాబాద్, నిర్దేశం:
ప్రభుత్వం చాలా క్లియర్‌గా చెబుతోంది. కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాలు సర్కారువేనని. అయినా, HCU తిరకాసు పెడుతోంది. విద్యార్థి సంఘాలు రెచ్చిపోతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ మరింత అగ్గి రాజేస్తున్నాయి. మంగళవారం ఆందోళనలు, అరెస్టులతో వర్సిటీ ఉద్రిక్తంగా మారింది.HCU దగ్గరికి వెళ్లకుండా రాజకీయ పార్టీల నేతలను ఉదయం నుంచే పోలీసులు అడ్డుకున్నారు. హైదర్‌గూడ MLA క్వార్టర్స్‌లోనే బీజేపీ ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్ట్ చేశారు. మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్ తదితరులు పోలీసులతో గొడవకు దిగినా.. వారిని కంట్రోల్ చేశారు. అటు.. కేటీఆర్, హరీశ్‌రావు ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు.బడా లీడర్లను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నా.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం HCU కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. బీజేవైఎం నేతలు వర్సిటీ గేటు ముందు ఆందోళనకు దిగారు. జంతు ప్రేమికుడిని అంటూ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తన అనుచరులతో హెచ్‌సీయూ ముందు హంగామా చేశారు. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని వేరే వేరే పోలీస్ స్టేషన్లకు తరలించారు. యూనివర్సిటీ ముందు పెద్ద సంఖ్యలో పోలీసులు కాపలా కాస్తున్నారు.మరోవైపు, 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం హైకోర్టును చేరింది. ఆ భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ ‘వట ఫౌండేషన్’ కోర్టులో పిల్ వేసింది. ఇలా.. ఆ భూములపై పెద్ద స్థాయిలో రచ్చ నడుస్తోంది.వరుస పరిణామాలపై కాంగ్రెస్ సర్కారు సీరియస్‌గా ఉంది. అభివృద్ధి కోసం, ఐటీ కంపెనీల కోసం ప్రభుత్వ భూమిని అమ్మితే ఇంతలా రచ్చ చేయడం ఏంటని ముఖ్యమంత్రి మండిపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్మలేదా? అని నిలదీస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి.. బీజేపీ పార్టీ ఈ ఇష్యూను కావాలనే రచ్చ చేస్తోందని తప్పుబడుతున్నారు. ఆ 400 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండేనని పక్కాగా పత్రాలు, ఆధారాలు చూపిస్తున్నా ఇంకా ఈ గొడవేందని ఫైర్ అవుతున్నారు. సర్కారుకు సపోర్ట్‌గా కాంగ్రెస్ నేతలు సైతం గొంతు విప్పుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.2004లో ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ 400 ఎకరాల భూమిని IMG సంస్థకు కేటాయించారు. ముఖ్యమంత్రులు మారినా ఆ ల్యాండ్ IMG వద్దే ఉంది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. సుప్రీంకోర్టులో పోరాడి ప్రభుత్వ భూమిని తిరిగి దక్కించుకున్నారు. 20 ఏళ్లుగా భూమి వివాదంలో ఉంది కాబట్టి అక్కడ చెట్లు పెరిగాయి. అంతే కానీ అవి అటవీ భూములు కాదని.. కావాలనే ప్రతిపక్ష పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జింక చనిపోయిందని ఫేక్ పోస్టులు పెట్టి.. ఆ తర్వాత ట్వీట్లు డిలీట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని.. పర్యావరణ వేత్తలను తప్పుదారి పట్టిస్తున్నారు ఆరోపించారు. హెచ్‌సీయూ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి.. వర్సిటీ రిజిస్ట్రార్ బీజేపీ పెద్దలు చెప్పినట్టు చేస్తున్నారని ఎంపీ చామల విమర్శించారు. 400 ఎకరాల భూమిని యూనివర్సిటీ భూమిగా చెబుతూ విద్యార్ధులను రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు.