బుద్ధ విహార్ కమిటీలో హిందువులేంటి?
– బీటీ చట్టం పేరిట కొత్త చట్టం చేసిన ప్రభుత్వం
– బోధ గయ బౌద్ధ క్షేత్ర ట్రస్టులో మెజారిటీ హిందువులు
– హిందు ట్రస్ట్ బోర్డుల్లో అన్యమస్తులు లేనప్పుడు బుద్ధిస్ట్ బోర్డుల్లో ఉండడం ఏంటి?
– తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న బుద్ధిస్టులు
– ఈ అంశంపై మరోసారి పక్షపాతం చూపించిన ప్రధాన మీడియా
నిర్దేశం, హైదరాబాద్ః
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో క్రైస్తవులను నియమించారంటూ అప్పుడెప్పుడో చాలా పెద్ద వివాదం జరిగింది. హిందూ దేవాలయాల్లో హిందువులను మాత్రమే నియమించాలని ఆ వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ మత సంస్థకు చెందిన దేవాలయాల్లో ఆ మతస్థులు ఉండటం మంచిదే. హిందూ ట్రస్ట్ బోర్డుల్లోకి క్రైస్తవులు రావడం ఎంత అభ్యంతరకరమో బుద్ధ విహారాల బోర్డుల్లో హిందువులు రావడం కూడా అంతే అభ్యంతరకరం. అధికారం ఉంటే ఉండొచ్చు గాక, అహంకారం పనికి రాదు. తాజాగా బోధగయ ఆలయ చట్టంపై బిహార్ సహా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఆ చట్టం రద్దు చేయమంటూ సుమారు 10 రోజులుగా బౌద్ధులు, బిక్షువులు నిరసనలు చేస్తున్నారు.
సరే.. మన మీడియా అంతా హిందూ క్యాస్ట్ మీడియా కాబట్టి, దీని గురించి ఎలాగూ చూపించదు. అందుకే చాలా మందికి ఈరోజుకి కూడా దాని గురించి తెలియదు. కానీ, సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది కదా. అది వదిలిపెట్టదు. ప్రధాన మీడియా పక్కన పెట్టిన ఈ అంశంపై నెటిజెన్లు లెఫ్ట్, రైట్ వేసుకుంటున్నారు. బీటీ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నినదిస్తున్నారు. ఇది దేశంలోని అన్ని మూలాలకు వ్యాపిస్తోంది. సహజంగా బుద్ధిజాన్ని ఎక్కువగా అవలంబించేంది దళితులు. ఒకానొక సమయంలో దేశంలో బుద్ధిజం విరాజిల్లిన అనంతరం.. ముఘలులు, హిందు రాజుల దారుణాల వల్ల బుద్ధిజం మన దేశంలో కనుమరుగైంది. అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్న తర్వాత మరోసారి బుద్ధిజం ఎదగడం ప్రారంభించింది. కేంద్ర లెక్కల్లో బుద్ధిస్టుల జనాబా తక్కువగా ఉండోచ్చేమే కానీ, వారి అసలు జనాభా ముస్లిం జనాభా కంటే ఎక్కువే ఉంటుంది.
బీటీ చట్టం ఏంటి?
బీటీ చట్టం (బుద్ధగయ టెంపుల్ యాక్ట్) ప్రకారం, బోధగయ బుద్ధవిహార బోర్డుకు తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురు మాత్రమే బౌద్ధులు ఉంటారు. మరో నలుగురు హిందువులు. ఇక ఛైర్మన్ సదరు జిల్లా కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ బుద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి అయితే ఉండడం కష్టమే. అయితే, బోర్డులో మెజారిటీ హిందువులే. వారంతా ప్రధానంగా బ్రాహ్మణులేనని వేరే చెప్పనక్కర్లేదు. దేవాలయాల్లో అన్యమతస్తులకు ప్రవేశం కూడా ఇవ్వమని కొన్ని సార్లు అనే ప్రభుత్వం.. బుద్ధ విహారాల్లో అన్యమతస్థులను ఎందుకు చేర్చాలనుకుంటున్నారు? బౌద్ధం గురించి వారికేం తెలుస్తుంది? ప్రభుత్వ విధానం చూస్తుంటే.. బౌద్ధాన్ని మరోసారి దండయాత్ర చేసే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమాత్రం ఆనవాళ్లు లేకుండా దేశంలో బౌద్దమే వినిపించకుండా చేయాలనే కుట్ర జరుగుతున్నట్లు నిరసనకారులు అంటున్నారు.
రాజ్యాంగ నిబంధనకూ వ్యతిరేకమే
బీటీ చట్టం ప్రకారం బుద్ధగయ ఆలయ నిర్వహణ వివిధ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఏ మతానికి ఉండాల్సిన స్వయం ప్రతిపత్తి ఆ మతానికి ఉండాలి. మతం వ్యక్తిగతం. అందులో రాజకీయం చేయడం, ప్రభుత్వం వేలు పెట్టడం లాంటిది చేయకూడదు. ఈ విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. బీటీ చట్టం రద్దు చేయడంతో పాటు, బౌద్ధ సమాజానికి స్థలంపై పూర్తి నియంత్రణను ఇవ్వడానికి మహాబోధి మహావిహార చైత్య ట్రస్ట్ అనే కొత్త స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని కూడా ప్రాతినిథ్యం కోరింది.
భారత అపూరప సంపద బౌద్ధం
ఈ దేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా వెలుగొందిన మతం బౌద్ధం. ప్రపంచంలో జీసెస్ తర్వాత నేటికీ బుద్ధుడు ఎక్కువగా కనిపిస్తారు. ఇక చదువు, సంస్కారం, తెలివి, ఆధునికత, మానవత్వం, ప్రేమ.. ఇలా వేటికైనా బుద్ధుడు సూచిక. అంతటి ఔన్నత్యాన్ని మనం చేజేతులా చేరిపేసుకుని చైనా, జపాన్ లకు ఇచ్చేశాం. కనీసం ఆ గొప్ప సంపదను తిరిగి ప్రతిష్టించడం పక్కన పెట్టి, దానిని ఇంకా ధ్వంసం చేయాలనుకోవడం ఏంటి? బౌద్ధ వారసత్వాన్ని కాపాడాలి. బౌద్ధమంటే భారత్ అని ప్రపంచానికి తెలియజెప్పాలి. అలా చెప్పాలంటే బౌద్ధానికి స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. బౌద్ధులు మాత్రమే బుద్దిజాన్ని సరిగా అర్థం చేసుకోగలరు. అన్యమతుస్తులు బౌద్ధం ఎదుగుదలకోసం పని చేయరు. అన్య మతస్తులపై దుమ్మెత్తి పోసే మన రాజకీయ పార్టీలకు ఈ విషయం తెలియనిది కాదు.
1949 చట్టం బౌద్ధ వ్యతిరేకం: భంతే ఆనంద్
బోధగయ మహాబోధి బీహార్ నిర్వహణ చట్టం 1949 బౌద్ధులకు వ్యతిరేకమని బుద్ధ గయ మహాబోధి బీహార్ ముక్తి ఆందోళన్ సమితి జాతీయ అధ్యక్షుడు భంతే ఆనంద్ అన్నారు. గురువారం కుషినగర్‌లో జాగ్రణ్‌తో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ.. ఇది హిందువులు, బౌద్ధుల మధ్య సామరస్యాన్ని చూపించడానికి ఒక నెపం మాత్రమేనని, నిజానికి బుద్ధిజంపై ఆధిపత్యానికే ఈ చట్టం తెచ్చారని అన్నారు. తమ డిమాండ్ కోసం నిర్వహిస్తున్న ఉద్యమాన్ని భంగపరచడానికి, కొంతమంది దానికి రాజకీయ రంగు పులుముకోవడానికి ప్రయత్నించారని, కానీ వారు విజయం సాధించలేకపోయారని ఆయన అన్నారు. ఈ ఉద్యమానికి వస్తున్న ప్రజాదరణను చూసి, కొంతమంది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా ఉద్యమాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించారు. ఈ సమస్యను పరిష్కరించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.