వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం: షబ్బీర్ అలీ.
వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు.
వేలాదిమంది ముస్లింలతో నిజామాబాద్‌లో వక్ఫ్ బచావో ర్యాలీ
నిర్దేశం: (నిజామాబాద్ ప్రతినిధి),
“వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం. ఇది ముస్లిం మైనారిటీల హక్కులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర. వక్ఫ్ ఆస్తులపై హక్కును కోల్పోకుండా ఉండేందుకు మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. చట్టబద్ధంగా ఈ బిల్లును అడ్డుకుంటాం,” అని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఆదివారం నాడు నిజామాబాద్ పట్టణంలో భారీగా వక్ఫ్ బచావో ర్యాలీ నిర్వహించారు. శైలజా గ్రౌండ్ నుండి ఖిల్లా రోడ్ దాకా సాగిన ర్యాలీలో వేలాదిమంది ముస్లింలు పాల్గొన్నారు. మత నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువత ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్నవారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గట్టిగా నినాదాలు చేశారు. వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణ చేయకుండ కాపాడాలని డిమాండ్ చేశారు.
….వక్ఫ్ బిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం…
వక్ఫ్ బోర్డు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం నాడు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపిస్తున్నారు.
… అభ్యంతరాలు ఏంటి ?
- 1, వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యత కలెక్టర్లకు ఇవ్వడం .
- 2.వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులకు స్థానం కల్పించడం
- 3 మత స్వాతంత్ర్యాన్ని భంగం చేయడం
- 4.రాజ్యాంగ ఆర్టికల్స్ 25, 26లకు వ్యతిరేకంగా నూతన బిల్లు ఉండటం
“ముస్లింల హక్కులను కాపాడేందుకు ఈ పోరాటం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం జరగనుందని మా నమ్మకం,” అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
నిజామాబాద్‌లో భారీగా నిర్వహించిన వక్ఫ్ బచావో ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం నింపింది. ఇతర జిల్లాలు, మండలాల స్థాయిలోనూ ఇలాంటి ఉద్యమాలు జరపడానికి ముస్లిం సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.