పదో తరగతి బాలికలందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తాం

పదో తరగతి బాలికలందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తాం

– కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

నిర్దేశం, కరీంనగర్ః

ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ సైకిల్ అవసరం ఉన్న బాలికలు అందరికీ సైకిళ్లను అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ద్వారా వందమంది ప్రభుత్వ పాఠశాల బాలికలకు ఆయ‌న‌ సైకిళ్లు అందజేశారు.

ఈ సందర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆడపిల్లలు భారం కాదని కుటుంబానికి, సమాజానికి భరోసా అని అన్నారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి వివాహం అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కిశోర శక్తి, భేటీ బచావో భేటీ పడావో, జన్మోత్సవ్, ముద్ర యోజన వంటి పథకాల ద్వారా ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఆడపిల్ల ఉన్న ఇల్లు పండగ వాతావరణం లో ఉంటుందని అన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివే ఆడపిల్లలకు సైకిల్ అందిస్తామని తెలిపారు. బాలికల హాస్టల్ లో వాషింగ్ మిషన్ వంటి ఉపకరణాలు అందిస్తామన్నారు. భేటీ బచావో బేటి పడావో లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అధికారులు ముందుకు వెళ్లాలని సూచించారు. అంతకుముందు ఇక్కడ పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో పథకంలో భాగంగా పాఠశాలకు దూరంగా ఉండి సైకిల్ లేని వారిని గుర్తించి వంద మందికి సైకిల్ అందజేస్తున్నామని అన్నారు. ఇందులో 30 సైకిళ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసిందని అన్నారు. జిల్లాలో స్నేహిత కార్యక్రమం ద్వారా కెరియర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సంక్షేమ పథకాలపై బాలికలకు అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అంధుల పాఠశాలలో వాషింగ్ మిషన్లు అందించామని తెలిపారు. జిల్లాలో పదో తరగతి మధ్యలో ఆపేసిన 110 మంది విద్యార్థులు గుర్తించి వారందరికీ పరీక్ష రాయించామని, 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఆడపిల్లల స్వీయ రక్షణకు పోలీస్ శాఖ తరఫున అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆడపిల్లలకు విద్య ఎంతో అవసరమని, చదువుతో బాలికలు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నాటకాలు, నృత్యాలు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »