దశలవారిగా పేదలందరికి ఇండ్లు నిర్మిస్తాం. – మంత్రి శ్రీధర్ బాబు
నిర్దేశం, భూపాలపల్లిః
ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామని ఆనాడు హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా స్థలాలున్న అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తునట్లు రాష్ట్ర, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కాటారం మండలం, ధన్వాడ గ్రామంలో బొడిగె భాగ్య, చేకుర్తి పావని, ఆత్కూరి దుర్గ మరియు తాటి పల్లవి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన, పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు మొదటి విడతలో 1733 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలను ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ కార్యక్రమాన్ని మొదలు పెట్టి దిగ్విజయంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలని కన్న కలలు గత 10 సంవత్సరాలలో నెరవేరలేదని అన్నారు. ఆనాటి ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం చేయలేదని, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూశారని, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో ఇంటి స్థలాలు ఉండి ఇండ్లు లేని వారిని ఎంపిక చేశామని మంత్రి వివరించారు.
ఇండ్ల నిర్మాణాలను సబ్ కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. నిర్మాణంలో ఎప్పటికప్పుడు ఇండ్ల ప్రగతి ఫోటోలు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, తప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఐ ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం 400 నుండి 600 ఎస్ఎఫ్టి వరకు పరిమితి ఉందని, కొలతలు పెంచడానికి అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.