తుస్సుమన్న కేసీఆర్ ప్లాన్

తుస్సుమన్న కేసీఆర్ ప్లాన్
– మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు
– మహారాష్ట్ర నేతల ఆగ్రహం
– సొంత రాష్ట్రంలో అభ్యర్థుల కరువు
– టీఆర్ ఎస్ పేరు మార్పుతో నష్టమే..

(ఈదుల్ల మల్లయ్య)

కేసీఆర్.. మొన్నటి వరకు దేశ రాజకీయాల్లో కీలకమైన నేతగా ఆ పార్టీ నేతలు గ్లోబల్ ప్రచారం చేసుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో దేశ వ్యాప్తంగా పోటీ చేయడానికి సిద్ధమంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్ ఫోటోలతో ప్లెక్సిలు కట్టారు. రాబోయే కాలంలో మహారాష్ట్రంలో తమదే ప్రభుత్వం అనే స్థాయిలో పోజులు కొట్టారు. కానీ.. ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే ఓడి పోయి ప్రతిపక్ష హోదాకు పరిమితం కావడంతో ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు సైతం రాలేక పోయారు.

మహారాష్ట్ర నేతల ఆగ్రహం

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కేసీఆర్‌పై మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ కు ఘాటు లేఖను మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు రాశారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీసులకు అద్దె చెల్లింపు నిలిపివేసింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. మహారాష్ట్ర నేతల ఫోన్లు చేస్తుంటే బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని సమాచారం. మహారాష్ట్ర నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఫండింగ్ ఆపివేయడంతో పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని నమ్మకంగా చెప్పి ఎన్సీపీ, కాంగ్రెస్‌ నుంచి పలువురిని చేర్చుకుంది బీఆర్‌ఎస్‌. తాజా పరిణామాలపై ఆరుగురు కోఆర్డినేటర్లు సమావేశం అయ్యారు. బీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు

గతంలో మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకెళ్లింది. కొత్త పార్టీగా వచ్చిన మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా మారుతుందని అనుకున్న అక్కడి ప్రతిపక్ష నేతలు సొంత పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో కేసీఆర్ దేశ రాజకీయాలను పక్కకి పెట్టి రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. మరి దేశ రాజకీయాల్లో తన సత్తా చాటాలని భావించిన కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.

టీఆర్ ఎస్ పేరు మార్పుతో నష్టమే..

టీఆర్ఎస్.. ఈ పేరు వినగానే కేసీఆర్ గుర్తుకు వస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రతి గడుపకు వెళ్లింది. కానీ.. జాతీయ రాజకీయాల్లోకి వెళుతానని కేసీఆర్ టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చడంతోనే శని పట్టుకుందనే టాక్ పార్టీ వర్గాలలోనే వినిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ బీఆర్ ఎస్ జాతీయ స్థాయిలో పోటీ చేస్తారా… లేదా అనే అంశం స్పష్టత ఇవ్వడం లేదు. సొంత రాష్ట్రంలోనే లోక్ సభకు పోటీ చేయడానికి అభ్యర్థుల కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో దేశ వ్యాప్తంగా పోటీ చేయడం అసాధ్యమంటున్నారు బీఆర్ ఎస్ శ్రేణులు. ఇంతకు కేసీఆర్ మదిలో ఏముందో..?

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!