నడ్డా వారసుడి కోసం రంగం సిద్ధం.
న్యూఢిల్లీ, నిర్దేశం:
వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం సాధించి, దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి నెక్ట్స్ బాస్ ఎవరనే ప్రశ్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జేపీ నడ్డా తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు వస్తారని ఆ పార్టీతో పాటు దేశ రాజకీయ వర్గాలన్ని ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 లోపు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు, 50 శాతం రాష్ట్రాలలో సంస్థాగత ఎన్నికలు తప్పనిసరి. దానికి ముందు, బూత్, మండల్, జిల్లా స్థాయిలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం 36 రాష్ట్రాలలో 12 రాష్ట్రాలలో మాత్రమే ఎన్నికలు పూర్తయ్యాయి. కాబట్టి కనీసం ఆరు రాష్ట్రాలలో యూనిట్ చీఫ్‌ల ఎన్నికలు అవసరం.వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాంచ, గుజరాత్ రాష్ట్రాలలో బీజేపీ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఎటువంటి మార్పు ఉండదు. అత్యున్నత పదవికి ప్రతిపాదిత పేర్లను సమర్పించాలని రాష్ట్ర ఇన్‌చార్జ్‌లను ఇప్పటికే పార్టీ అధిష్టానం కోరింది.
ప్రస్తుతానికైతే ఏ ఒక్కరి పేరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో వినిపించడం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించబడాలంటే.. కచ్చితంగా ఆ వ్యక్తికి ఆర్‌ఎస్‌ఎస్ ఆమోదం ఉండాల్సిందే. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ భావజాలం గురించి తెలిసి, ఆ సిద్ధాంతాన్ని నమ్మి, పాటించే వ్యక్తికే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కనుంది.2019లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా పార్టీ బాధ్యతలను స్వీకరించారు. జనవరి 2020లో ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన కంటే ముందు ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నుంచి నడ్డా ఆ బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలోకి ప్రవేశించడంతో, పార్టీ ఆయన తర్వాత ఎన్నికయ్యే అభ్యర్థుల కోసం చూస్తోంది. కానీ ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. పార్టీలోని అగ్రనేతలు ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించాలని ఆశిస్తున్నారు. మరి చూడాలి ఎంతో పవర్ ఫుల్ పొజిషన్‌గా భావిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు వస్తారో. బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో పలువురి పేర్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, పార్టీ జనరల్ సెకెటరీ సునీల్ బన్సల్, అగ్రనేతలు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, వినోద్ తావ్డే వంటి ప్రముఖులు ఉన్నారు. అయితే, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరనేది నిర్ధారణ కాదు.