ఎర్రెర్రని చారికలలోన!
******
ఎప్పుడు రక్తం పారుతుందా అని
ఎదురు చూస్తుంది ఓ గద్ద
రక్తం పారకుండా పంట పండాలని
కష్టిస్తాయి చాలా చేతులు…
గద్ద కాలక్షేపమంతా
విషాదాల్ని చూసి విరగబడి నవ్వడానికే
కష్ట చేతుల కాలమంతా
పచ్చ పచ్చని పంట నేల నిండా పండించడానికే…
చేతుల్ని ప్రేమిస్తున్నానంటుంది గద్ద
తనను గౌరవించమని గోముగా చేతుల్ని కోరుతుంది!
బాంబులు
తూటాలు
బుల్డోజర్లు
అవసరమైతే వైమానిక దాడులు…
ఎన్ని సౌకర్యాలున్నవి
ఓట్లు నెలకొల్పిన పీఠానికి!
అరెస్టులు
ఊపాలు
ఎన్ ఐ ఏ దాడులు
ఎన్ కౌంటర్లు
ఎన్ని ప్రతిఫలాలున్నవి ఓట్లకు!
గద్దల చరిత్రంతా రక్తమే
చేతుల చరిత్రంతా పంటలే
చేతుల పంటని గద్ద అసూయపడుతుంది
చేతుల రక్తాన్ని గద్ద కళ్ళ చూస్తుంది…
పీఠాలు పవిత్రమైనవి
ఓట్లు విలువైనవి
ఓ ఒడంబడిక చేస్తుంది గద్ద
చేతులు కేవలం తనకోసం చప్పట్లు కొట్టాలని…
గద్ద ఎప్పుడూ పంట పండించలేదు
పంటను మాత్రమే ప్రేమించే చేతులు ససేమిరా అంటాయి!
గద్దకిష్టమైన కాంక్రీటు రోడ్డు మీద
గద్ద బాధ్యతగా దిగ్గొట్టిన మేకుల మీద
ఎర్రెర్రని రక్తపు మరకలు
గద్ద కళ్ళలో ఓ సంతృప్తి…
చేతులు, చేతులలోని పచ్చని పంటలు
ఇప్పుడు ఎర్రగా
ఓట్లు ఒక్కోసారి విరగబడి నవ్వుతాయి
పీఠాలతో తామూ ఓ గేమ్ ఆడగలమని…
ఎప్పటికైనా పీఠాలు పుచ్చిపోతాయి లేదా తుప్పు పడతాయి
చేతులు పచ్చని చేను లోంచి ఓ సూర్య బింబాన్ని పైకి
ఎత్తి పడతాయి!
– జి. కళావతి