Take a fresh look at your lifestyle.

ఓడిన కాంగ్రెసొళ్లదే పెత్తనం.. గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహమే

0 13

ఓడిన కాంగ్రెసొళ్లదే పెత్తనం..
గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహమే

(ఈదుల్ల మల్లయ్య)
ఔను.. వాళ్లు పేరుకే ఎమ్మెల్యే.. అధికారమంతా ఓడినొళ్లదే.. అగో.. గెలిచిన ఎమ్మెల్యేలు గాకుండా ఓడి నొళ్లకు అధికారం ఏంటి అనుకుంటున్నారా..? కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి పక్ష ఎమ్మెల్యేలను ఎలా చూశారో.. ఇగో.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే జరుగుతుంది. అధికార బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అంటే ఆ నియోజక వర్గానికి రాజులా వ్యవహరించేవారు. కానీ.. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ ది.. కానీ.. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు.

ఎమ్మెల్యే హోదాలో అధికారులను పిలిచిన వచ్చే వారు లేరు. రెస్సాన్స్ కూడా లేదు. కానీ.. అదే ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి ముందు ఉదయం నుంచి ‘‘జూ.. హుజూర్’’ అంటూ అధికారులు నిరిక్షిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడు మారుతాయో ఎవరికి అంతు పట్టదు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతి పక్షహోదాకు పరిమితమైతారని ఊహించలేరు. కానీ.. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్ అండ్ కో టీమ్ మారిన రాజకీయాలలో అనుభవిస్తున్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షాలకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ టు సేమ్ ఇస్తోంది.

ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని మాటలు చెప్పి అధికారం చేకిక్కిన అనంతరం ఆచరణ శూన్యం అవుతోంది. అధికార దర్పం ప్రదర్శిస్తూ అంతా తామే అన్నట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. అధికార మార్పిడి జరిగిందే కానీ నాడు బిఆర్ఎస్ నేడు కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు ఒక్కటే. మార్పు కోసం కాంగ్రెస్ అనే స్లోగన్ తో అధికారం దక్కించుకున్నప్పటికి మార్పు ఏమాత్రం కనిపించడం లేదు. బిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పయనిస్తోంది.
అదే అధికార దర్పం. అవే నియంతృత్వ పోకడలు. మార్పు జరిగింది కేవలం నేతలే. రాజకీయ ఆధిపత్యంలో ప్రజలు అమాయకులుగా మిగిలిపోతున్నారు. అధికార మార్పిడి జరిగి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది. అప్పుడే ఆధిపత్యపోరు నియోజకవర్గాల్లో మొదలైంది. గెలిచింది ఒకరైతే పెత్తనం మరొకరిది.

ఎమ్మెల్యేగా గెలిచినా…

ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు అధికారం మాత్రం చేతుల్లో లేకుండా పోయింది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంచార్జీలదే హవా కొనసాగుతోంది. పేరుకే ఎమ్మెల్యేలుగా ఉత్సవ విగ్రహాల కంటే తక్కువే అయ్యింది పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన కాంగ్రేసేతర ఎమ్మేల్యేలు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఎవరికి పిర్యాదు చేసినా ఒరిగేది ఏమీ లేక మీడియా ముందు వాపోవడం, సోషల్ మీడియాలో విమర్శలు చేస్తు కాలం వెళ్లదీస్తున్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంటే అధికారులు వాళ్ళ మాటకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఎమ్మెల్యే మాటకు విలువలేకుండా పోయింది. గతంలో రాజకీయాలకు నేటి రాజకీయాలకు పొంతన లేకుండా పోయింది. ఎంతో ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు కొనసాగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత రాజకీయాలు వెగటు పుట్టిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking