కమలదళంలో కోల్డ్ వార్
హైదరాబాద్, నిర్దేశం
“రాజాసింగ్‌కు ఎవరూ సాటిలేరు.. ఆయన హిందూ ధర్నానికి ఆదర్శం. సర్వం హిందూ ధర్మం కావాలన్నదే రాజాసింగ్ లక్ష్యం”. ఈ మాటలు అన్నది మరెవరో కాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సడెన్‌గా బండి అంతలా రాజాసింగ్‌ను ఎందుకు పొగడాల్సి వచ్చింది? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు.. శ్రీరామనవమి శోభాయాత్రకు ముందు.. రాజాసింగ్‌ను బండి సంజయ్ ఎందుకు ఆకాశానికి ఎత్తారు? ఏదైనా వ్యూహం దాగుందా? మరెవరిపైనైనా మైండ్ గేమ్ ఆడారా? అనే చర్చ నడుస్తోంది.ఈమధ్య గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెచ్చిపోతున్నారు. కిషన్‌రెడ్డి టార్గెట్‌గా తూటాల్లాంటి మాటలు వదులుతున్నారు. బీజేపీ పెద్ద లీడర్ ఓ మేకప్‌మేన్ అని.. అతని టేబుల్ సాఫ్ చేసే వాళ్లకే పదవులు ఇస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. గౌతమ్‌రావును ఎమ్మెల్సీ కేండిడేట్‌గా ఎంపిక చేయడంపై రాజాసింగ్ కస్సుమన్నారు. అన్నిపదవులు మీవాళ్లకేనా? బీజేపీలో సీనియర్లు, కార్యకర్తలు లేరా? అంటూ కిషన్‌రెడ్డిపై డైరెక్ట్ అటాక్ చేశారు. ఇక, స్టేట్ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపైనా తరుచూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యమంత్రులతో బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసే వారికి కాకుండా.. నిఖార్సైన కాషాయ లీడర్లకు, ప్రజల కోసం పోరాటం చేసే వారికే ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలంటూ రచ్చ రాజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తనపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టడం వెనుకా.. తమ పార్టీ పెద్దలే ఉన్నారని కూడా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఇలా రెగ్యులర్‌గా కమలం పార్టీలో కలకలం రేపే రాజాసింగ్‌కు బండి సంజయ్ లాంటి బిగ్ లీడర్ సరిలేరు నీకెవ్వరూ అనే రేంజ్‌లో కితాబు ఇవ్వడం బీజేపీలో ఆసక్తిగా మారింది.
శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పాతబస్తీలో వేలాదిమందితో భారీ శోభయాత్ర చేపట్టారు రాజాసింగ్. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా.. శోభయాత్ర విషయంలో తగ్గేదేలే అని తేల్చి చెప్పారు. శాంతిభద్రతల సమస్యంటూ పోలీసులు టెన్షన్ పడుతున్నారు. పార్టీ తరఫున రాజాసింగ్‌కు ఎలాంటి సపోర్ట్ లేకున్నా.. ఆయన తన సొంత ఇమేజ్‌తో పాతబస్తీలో మజ్లిస్ పార్టీ ముందు తొడగొట్టాలని చూస్తున్నారు. జై శ్రీరాం.. జై బీజేపీ.. జై యోగి.. జై మోదీ నినాదంతో రాజాసింగ్ ఓల్డ్ సిటీ హీరోగా నిలుస్తున్నారు. ఆయనలోని కరుడుగట్టిన హిందుత్వ భావాజాలం వల్లే.. రాజాసింగ్‌ను పార్టీ అధిష్టానం సైతం ఏమీ అనలేక పోతోంది. లేదంటేనా.. కిషన్‌రెడ్డి ఎప్పుడో తొక్కేసేవారని పార్టీ వర్గాలే అంటున్నాయి. గతంలో ముస్లింలపై ఓ కాంట్రవర్సీ కామెంట్ చేయగా.. ఆయన్ను పార్టీ నుంచి కొన్ని నెలలు సస్పెండ్ చేశారు. ఎన్నికల ముందు మళ్లీ కాషాయ టికెట్ ఇచ్చి.. పాతబస్తీలో బీజేపీకి రాజాసింగ్ మినహా మరెవరూ దిక్కులేరని చెప్పకనే చెప్పారు. అలా సోలోగా ఎదిగి.. బండి సంజయ్‌తో సో బెటర్ లీడర్ అనిపించుకునే స్థాయికి చేరారు రాజాసింగ్.
బండి సంజయ్ కావాలనే రాజాసింగ్‌ను ప్రమోట్ చేస్తున్నారా? అనే డౌట్ కూడా లేకపోలేదు. తెలంగాణ బీజేపీలో తీవ్ర వర్గపోరు నడుస్తోందనేది ఓపెన్ సీక్రెట్. కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు లాంటి వాళ్లు ఓ టీమ్ అంటారు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రాజాసింగ్ తదితరులు మరో వర్గంగా ముద్ర పడ్డారు. బండి సంజయ్ తరఫున రాజాసింగ్ గట్టిగా మాట్లాడుతుంటారు. అసలే ఫైర్ బ్రాండ్ లీడర్ కావడంతో ఆయన నోటికి కంట్రోల్ ఉండదు. కిషన్‌రెడ్డి మెతక లీడర్ అని.. ఆయన అధ్యక్షుడిగా ఉంటే తెలంగాణలో బీజేపీ బలపడే ఛాన్సే లేదని గతంలోనే రాజాసింగ్ రచ్చ చేశారు. తాజాగా, అధ్యక్ష మార్పు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజాసింగ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. బండి సంజయ్‌కు అనుకూలంగా స్టేట్‌మెంట్స్ పాస్ చేస్తున్నారు. అటు, కిషన్‌రెడ్డి మాత్రం ఈటల రాజేందర్‌కు కిరీటం కట్టబెట్టాలని గట్టిగా ట్రై చేస్తున్నారట. ఇలాంటి సందర్భంలో కిషన్‌రెడ్డిని రాజాసింగ్ కార్నర్ చేస్తుండటం.. రాజాసింగ్‌కు ఎవరూ సాటిలేరు అంటూ బండి సంజయ్ అతన్ని పొగుడుతుండటంతో.. కాషాయ దళంలో కలకలం నెలకొంది.