సమ్మక్క రాక ఉత్కంఠ భరితం
–గౌరవార్థం గాలిలోకి కాల్పులు
— చలపయ్య వరకు మొదటి ఘట్టం
— గద్దె పైకి చేర్చడం రెండవ ఘట్టం
–దారి పొడవునా భక్తి పర్వశం
–పున్నమి వేళ. మేడారంలో మహాద్భుతం
వన దేవల జాతరలో అత్యంత ఉత్కంఠ భరితంగా సమ్మక్కను గద్దె పైకి తీసుకు వచ్చేది సాగుతుంది. గిరిజన పూజారులు మఘా శుద్ధ పౌర్ణమి వస్తుండగానే చిలకలగుట్టకు చేరుకుంటారు, చిలుకల గుట్టపైన గిరిజన పూజారి కుటుంబాలలో ప్రధాన పూజారులు, మరియు పూజారులు కలిసి తెల్లవారుజాము నుండి సాయంకాలం వరకు సమ్మక్కకు పూజలు చేస్తూనే ఉంటారు. గుట్టపై ఏమి జరిగేది పూజలు ఏ విధంగా చేసేది ఆ పూజారి కుటుంబాలకు తప్ప ఇతరులు ఎవర్ని కూడా చిలకలగుట్టను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కనివ్వరు…… (చిలకలగుట్ట చుట్టూ గిరిజన పూజారుల కుటుంబాలు తప్ప వారి వాలింటర్లు కింద ఉండగా), పూజారులు గుట్టపైన కొలువుదేరిన సమ్మక్కకు ప్రత్యేకంగా కుంకుమ భరిణిలోకి ఆవాహనం చేస్తారు….. ఆ సమయంలో ఎవరిని కూడా ఆ ఛాయలకు రానివ్వరు….. సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో మాత్రమే ప్రధాన పూజారి సమ్మక్కను గుట్టపై నుండి తీసుకుని గుట్ట దిగుతూ వస్తూ ఉంటారు…… ప్రధాన పూజారుల సమూహం చిలుకలగుట్ట దిగుతుండగానే సమ్మక్క తల్లి గౌరవర్ధం గాలిలోకి జిల్లాఎస్పీ స్వయంగా మూడుసార్లు కాల్పులు జరపటం జరుగుతుంది….. మూడుసార్లు గౌరవార్థం కాల్పలు జరుపగానే చిలకలగుట్ట కింద బారులు తీరిన భక్తజనం ఆద్యంతం భక్త పర్వశంతో పిక్కటిల్లేలా సమ్మక్క తల్లిని తలుస్తుంటారు. చిలకల గుట్టనుంచి చెలపఁయ్య గుడివరకు రహదారి ఆద్యంతం భక్త పర్వశంతో పిక్కటిల్లు పోతుంది. చిలకలగుట్ట నుండి చెలపఁయ్య గుడి వరకు దారికి ఇరువైపులా భక్తజనం సమ్మక్క రాకను చూస్తూ ఉండిపోతారు… శివసత్తుల హాహం కారాలతో ఆ ప్రాంతం మారుమోగుతోంది.
అడవి బిడ్డల అపురూపమైన జాతర .. కొండా కోనా పరవశించే జాతర … మేడారం మహా జాతర. సారలమ్మ గద్దెలపై కొలువుతీరటంతో ఊపందుకున్న జాతరలో నేడు అందరూ ఎదురు చూసే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చిలకలగుట్ట నుండి డోలు, కొమ్ము వాయిద్యాల చప్పుళ్ళతో , అధికార యంత్రాంగ హడావిడితో , గాలిలోకి కాల్పులు జరిపి ఆ తల్లికి స్వాగతం పలుకగా సమ్మక్క కుంకుమ భరిణె రూపంలో గద్దెలపై కొలువు తీరనుంది. పున్నమి నాడు నిండు జాబిలిగా ఆ తల్లి దర్శనం ఇవ్వనుంది.
కొలువుతీరిన సారలమ్మ ..
“””””””””””””””””””””””””””””””””””””””
మేడారం జాతరలో భాగంగా బుధవారం సాయంత్రం సారలమ్మను కన్నెపల్లె నుంచి గద్దె వద్దకు తీసుకొచ్చారు. పూజారులు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో గద్దెపై కొలువుదీరింది సారలమ్మ. ఈ సందర్భంగా భక్తులు ఆ తల్లికి జయజయధ్వానాలు పలికి ఘనస్వాగతం చెప్పారు. గద్దెపై కొలువుతీరిన అమ్మవారిని తనివితీరా చూసి తరించారు.
పతాక స్థాయికి మేడారం మహా జాతర
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
ఇవాళ సమ్మక్కఆగమనంతో జాతర పతాకస్థాయికి చేరుకోనుంది. నేడు గిరిజనుల ఇలవేల్పు సమక్క గద్దెలకు చేరనుంది. ఆ తల్లి ఆగమనం చూసేందుకు మేడారంలో భక్తజనకోటి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గిరిజన పూజారులు ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం గద్దెపైకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. సమ్మక్క కోరి కొలిచిన వారి కొంగు బంగారం ఆ తల్లి.
గిరిజన సంప్రదాయాలతో గద్దె మీదకు సమ్మక్క
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
కాకతీయ రాజులను ఎదిరించి నిలిచిన ధీశాలి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా పోరాటం సాగించిన అడవి బిడ్డ . శౌర్యపరాక్రమాలకు నిలువెత్తు రూపం అయిన ఆ తల్లి సమ్మక్క ప్రతిరూపంగా భావించే కుంకుమభరిణెను నేడు చిలకలగుట్ట నుండి అధికార లాంచనాలతో, గిరిజన సంప్రదాయాలతో గద్దె మీదకు తీసుకురానున్నారు. కాకతీయ రాజులతో పోరాడి వీరమరణం పొందినప్పటికీ తన వాళ్లను ఆశీర్వదించేందుకు రెండేళ్లకోమారు జనబాహుళ్యంలోకి వచ్చే సమ్మక్క తన బిడ్డలను చల్లగా కతాక్షించే శుభ ఘడియ ఈ రోజే రానుంది.
దేవతలా నామస్మరణతో ప్రతిధ్వనిస్తున్న వనం.
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
శతాబ్దాలుగా తనను నమ్మిన భక్తులకు వరాలిచ్చే తల్లిగా భాసిల్లుతున్న సమ్మక్క ఆశీర్వాదం కోసం భక్తులు నేడు ఎదురు చూస్తున్నారు. సమ్మక్క-సారక్క తల్లీ బిడ్డలు ఒకచోట చేరి వరాలిచ్చే శుభ ఘడియ కోసం వనంలో జనం నిరీక్షిస్తున్నారు. సమ్మక్క గద్దెపైకి వచ్చే ఆ మధుర ఘడియ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. సమ్మక్క నామస్మరణతో కొండలు, గుట్టలు ప్రతిధ్వనించనున్నాయి. ఇక సమ్మక్క ఆగమనం ఎలా సాగుతుందంటే
గౌరవార్థం గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
సమ్మక్క రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సైతం అంతా చిలకలగుట్ట కిందనే వేచి ఉంటారు. సమ్మక్క ఆగమనం కోసం నిరీక్షిస్తుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కుంకుమ భరిణెను తీసుకొని కిందకు వస్తున్న సమయంలో జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఆ తుపాకీ శబ్దాలే సమ్మక్క ఆగమనానికి సంకేతం. ఇక ఆ క్షణం నుంచి ప్రతి ఘడియా ఉత్కంఠ భరితం. దారికి ఇరువైపులా రంగు రంగుల ముగ్గులు వేసి తల్లికి స్వాగతం చెప్తారు. ఎదురుకోళ్లు, శివసత్తుల చిందులు, పూనకాలతో మేడారంలో ఆ తల్లిని ఆహ్వానిస్తూ ఆవాహనం చేసుకుంటారు భక్తులు.
గద్దెలపై సమ్మక్క ఆగమనం .. పున్నమి వేళ మహాద్భుతం.
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
భారీ బందోబస్తు మధ్య గద్దెల ప్రాంగణానికి పూజారులు చలపయ్య చెట్టు అక్కడనుంచి గద్దెలవరకు రోడ్డుకు ఇరువైపులా లక్షలాది మంది భక్తజనసందోహం.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఆ ఘట్టం చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఆ తల్లిని గద్దెల వద్దకు చేర్చే ముందు జయజయ ధ్వానాల నడుమ తొలుత చలపయ్య చెట్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ పూజలు చేసిన అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అప్పుడే నిండు జాతరగా మారుతుంది. నిండు పున్నమి వేళ జాబిలమ్మగా సమ్మక్క దర్శనం ఇస్తుంది. ఆ మరుక్షణం నుంచి మొక్కుల చెల్లింపులు ప్రారంభమవుతాయి. తల్లి మనసారా ఇచ్చే ఆశీర్వాదాల కోసం నేడు భక్త జనం పోటెత్తుతుంది.
గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్
సీనియర్ జర్నలిస్టు