తెలంగాణ అవతరణ దినోత్సవం 10వదా.. 11వదా?

– గతేడాదే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన కేసీఆర్ సర్కార్
– మళ్లీ 10 వసంతాల వేడుకలు చేయనున్న రేవంత్ సర్కార్
– తప్పెవరిది? ఎవరి లెక్క సరిగా ఉంది?

నిర్దేశం, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో 10 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగరంగ వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీని ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్న ఉద్దేశాన్ని నొక్కి చెప్పేలా ఈ సన్నాహాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

అయితే కేసీఆర్ ప్రభుత్వం పోయిన ఏడాదే 10 ఏళ్ల ఉత్సవాలు నిర్వహించింది. రేవంత్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ల ఉత్సవాలే నిర్వహిస్తోంది. మరి రెండింటిలో ఏది సరైంది? కేసీఆర్ ప్రభుత్వం సరైతే ఈసారి 11 వసంతాల ఉత్సవాలు నిర్వహించాలి. ఒక వేళ ఈ యేడాదే 10 వసంతాలు పూర్తైన సందర్భంగా నిర్వహించాలంటే గత కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించి ఉండకూడదు. మరి రెండింటిలో ఏది నిజమనే చర్చ సాగుతోంది.

కొంత మంది కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది వేడుకలు సరైనవని చెబుతుండగా, మరి కొందరు రేవంత్ సర్కార్ 10 వసంతాల వేడుకలే సరైనవని అంటున్నారు. ఇరు వైపుల చెప్పే వాదనలు అలాగే ఉన్నాయి. 2014 జూన్ 2ను పరిగణలోకి తీసుకుని పోయిన ఏడాదే అంటే 2023 జూన్ 2 నాటికే 10 సంవత్సరాల వేడుకలు నిర్వహించారు. అంటే 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలోనే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఇక రేవంత్ రెడ్డి వేడులకను సమర్ధించేవారు కూడా ఇలాగే చెప్తున్నారు. ఏడాది పూర్తైతేనే ఏడాది ఉత్సవాలు జరుగుతాయి. ఈ లెక్కన 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు పదేళ్లు పూర్తిగా గడుస్తాయి. దీంతో ఈ ఏడాదే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని అంటున్నారు.

ఈ రెండు వాదనల్లో క్లారిటీ రావాలంటే దేశ స్వాతంత్ర్య ఉత్సవాలను ఓసారి గమనించాలి. గతేడాది 2023 ఆగస్టు 15న భారత ప్రభుత్వం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించింది. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. అంటే.. 2023లో 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆ సందర్భంలోనే నరేంద్రమోదీ ప్రభుత్వం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరిపించింది.

ఈ లెక్కన చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలు సరైనవనే చెప్పొచ్చు. ఇక రేవంత్ సర్కార్ దశాద్ది ఉత్సవాలు సరికాదని చెప్పలేం. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల గడువు కాలం ఈ ఏడాదితోనే ముగుస్తుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ సహా ఇతర హామీలన్నీ 2024 జూన్ 2తో ముగుస్తాయి. చాలా సందర్భాల్లో ఏడాది కాలం పూర్తైన తర్వాత వసంత ఉత్సవం నిర్వహించడం మామూలే. మరి ఈ యేడాదితో తెలంగాణ అవతరించి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది కాబట్టి దశాబ్ది ఉత్సవాలు ఇప్పుడు చేయడం కూడా సరైందేనని అంటున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!