లోకల్ కే 85 శాతం
క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్, నిర్దేశం:
ఇంజినీరింగ్ సహా ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికతపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు ఇచ్చారు.ఇంజినీరింగ్ కోర్సులతో పాటు వృత్తివిద్య కోర్సుల్లో 85 శాతం సీట్లను తెలంగాణ స్థానిక విద్యార్థులకు కేటాయించనుంది. వీరినే రిజర్వ్డ్ కోటాగా పేర్కొంది. మరో 15 శాతం అన్ రిజర్వ్డ్ కోటాగా పరిగణించనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.అన్ రిజర్వ్డ్ కోటా విషయంలోనూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తెలంగాణలో కనీసం 10 ఏళ్లు నివసించినా… రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లేదా ఉద్యోగుల భాగస్వాములు పోటీ పడేందుకు అవకాశం కల్పించింది. ఈ కోటాలో తెలంగాణ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు కూడా అర్హులని వివరించింది.తాజా నిర్ణయంతో ఇంజినీరింగ్ సహా ఉన్నత విద్యా కోర్సుల సీట్ల కేటాయింపులో ఏపి విద్యార్థులు పోటీ పడే అవకాశం తొలగించినట్లు అవుతుంది.
ఫలితంగా సీట్లన్నీ స్థానిక తెలంగాణ విద్యార్థులకే దక్కే అవకాశం ఉంటుంది.స్థానికత విషయంలో చాలా రోజులుగా సందిగ్ధత నెలకొంది. ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నివేదిక ఆధారంగానే…. ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందినాన్ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కావాల్సి ఉండగా అది మార్చి 1కు వాయిదా పడింది. తెలంగాణలో దాదాపు 12వేలకు పైగా సీట్లను గత పదేళ్లుగా నాన్‌లోకల్ కోటాలో భర్తీ చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా ఆంధ్రా విద్యార్థులతో భర్తీ చేస్తున్నారు. ఈ కోటా రద్దు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే… తాజాగా సవరణ ఉత్తర్వులను జారీ చేసింది.ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. దరఖాస్తుల స్వీకరణపై అధికారులు మరో ప్రకటన చేసే అవకాశం ఉంది. మార్చి 1వ తేదీ నుంచే మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈసారి నాన్ లోకల్ కోటా లేకపోవడంతో ఏపీ విద్యార్థులు.. తెలంగాణలోని కాలేజీల్లో ఎంత మేరకు చేరతారనే సందేహాలు కూడా ఉన్నాయి.