రాహుల్, సోనియా తో తెలంగాణ బీసీ మంత్రుల భేటీ
మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ చర్చ
న్యూఢిల్లీ, నిర్దేశం:
ఢిల్లీ పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కలిశారు. జంతర్ మంతర్‌లో బీసీ రిజర్వేషన్ల ధర్నా వివరాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మరో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వివరించారు. మంత్రులు, ఎంపీలను సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీని కలిశారు. మర్యాదపూర్వకంగా అధిష్టానం పెద్దలను కలిశారు. అధిష్టానం పెద్దలతో తెలంగాణ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. 2008లో సోనియా గాంధీని కలిశానని పాత జ్ఞాపకాలను ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై జంతర్ మంతర్‌లో పాల్గొన్నట్లు సోనియాకు విప్ ఆదిశ్రీనివాస్ వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని ఈ సందర్భంగా నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్‌కు వెన్నంటే ఉన్నారని వారికి చేసే మేలు ప్రజలు మరవరని అన్నారు. బీసీ రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పులు తెస్తాయని ఉద్ఘాటించారు. నేతలు మరింత కష్టపడాలని అందరికి సంక్షేమ పథకాలు అందించాలని సోనియా గాంధీ సూచించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వంతో బలంగా కొట్లాడుతామని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర వైఖరిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీ లతో భేటీ అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
బీసీలకు మంత్రి పదవులపై చర్చ.
బీసీలకు మరో రెండు మంత్రిపదవులు ఇవ్వాలని కోరామని. ఇద్దరికీ ఇచ్చే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీలకు మంచి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు.