తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ…?

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ…?

హైదరాబాద్, నిర్దేశం
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న ఆసక్తి నెలకొనగా.. ఇలాంటి సందర్భంలో అనూహ్య పరిణామం నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై హస్తం పార్టీ వేటు వేసింది. పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. గత కొంతకాలంగా బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న వేదిక దొరికినప్పుడల్లా సొంత పార్టీలోని ఓ వర్గం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో నిందిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు.. రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటమే కాకుండా.. ఆ నివేదికను కాల్చేయటం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో.. పార్టీ నాయకత్వం మల్లన్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా క్షమశిక్షణా చర్యల కింద అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.ఇంతవరకు అందరూ ఊహించిందే. కానీ.. ప్రస్తుతం బీసీ రాగం ఎత్తున్న తీన్మార్ మల్లన్న తర్వాత ఏం చేయబోతున్నారు.. ఎలాంటి రాజకీయ ముందడుగు వేయనున్నారన్నది తెలంగాణ పాలిటిక్స్‌లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. గత కొంత కాలంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తీన్మార్ మల్లన్న సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నారా.. లేదంటే మరేదైనా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా అన్నది ఉత్కంఠగా మారింది.అయితే.. అన్ని పార్టీల్లోనూ ఉన్నత కులస్థులే ఉన్నారని.. బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతోందంటూ ప్రతిసారి తన గళాన్ని వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న.. బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టనున్నారన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.              ఇందుకు బలం చేకూర్చేలా.. ఇప్పటికే “అవసరమైతే బీసీలంతా కలిసి ఓ పార్టీ పెడతాం” అంటూ ఆర్. కృష్ణయ్య, వట్టే జానయ్య లాంటి బీసీ సీనియర్ నాయకులు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. దీంతో.. బీసీ నాయకులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు నడుం బిగించిన తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టే దిశగానే అడుగులు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు జనాలు.అయితే.. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. గత నెలలో నిర్వహించిన వరగంల్ బీసీ సభలోనే తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే.. ఆ ప్రచారం మాత్రం నిజం కాలేదు. కాగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేయటంతో.. ఇక ఎలాంటి అడ్డంకులు లేవని.. కొత్త పార్టీ పెట్టటం ఖాయమంటూ ఆయనకు మద్దతిచ్చే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీసీ నినాదం వల్లే కాంగ్రెస్ పార్టీ మల్లన్నను సస్పెండ్ చేసిందని.. బీసీల మద్దతు ఆయనకు ఇప్పటికే కావాల్సినంత వచ్చిందని చెప్తున్న ఆయన మద్దతుదారులు.. కొత్త పార్టీ పెట్టేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడుతున్నారు. అయితే.. బీసీ సంఘాల నాయకులతో చర్చించిన తర్వాతే తన రాజకీయ భవిష్యత్‌పై మల్లన్న అధికారికంగా ప్రకటన చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉంటే.. మరో ఆసక్తికర చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. తీన్మార్ మల్లన్న గతంలో బీజేపీలో చేరగా.. కొన్ని కారణాల వల్ల బయటికి వచ్చి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టిన విషయం తెలిసిందే. అయితే.. గత కొంతకాలంగా బీసీ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్న బీజేపీ పార్టీలోకి.. తీన్మార్ మల్లన్న మళ్లీ వెళ్లే అవకాశం కూడా లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది.ఇది ఒక వాదన అయితే.. తీన్మార్ మల్లన్న తెలంగాణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారన్న ఆసక్తికర టాక్ నడుస్తోంది. కొంతకాలంగా తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. సరైన నాయకుడు ముందుకు రావటం లేదు. అయితే.. టీడీపీ ముందు నుంచి బీసీల పార్టీగా పేరున్న నేపథ్యంలో.. రాష్ట్ర అధ్యక్షుడి పదవి కూడా ఖాళీగానే ఉండటంతో.. తీన్మార్ మల్లన్నకు ఇది కలిసొచ్చే అంశమేనన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న… తనదైన శైలిలోనే ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. బీసీ నినాదాన్ని బలంగా వినిపించే దిశగా అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ…. పలువురు నేతల తీరును సూటిగా ప్రశ్నించటం మొదలుపెట్టారు. కొన్ని వేదికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో… తీన్మార్ మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చేది బీసీ రాజ్యమేనని… ఇందుకోసం ఎక్కడివరకైనా పోరాటం చేస్తామంటూ ప్రకటనలు కూడా చేశారు.ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన వివరాలను తీన్మార్ మల్లన్న తీవ్రంగా వ్యతిరేకించారు. బీసీల లెక్కలను తక్కువ చేసే కుట్ర జరిగిందని.. కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆ నివేదికను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఇక వరంగల్ వేదికగా నిర్వహించిన బీసీ సభలో…. ఓ సామాజికవర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వర్గం వారు గాంధీ భవన్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. ఫలితంగా తీన్మార్ మల్లన్న తీరు… కాంగ్రెస్ పార్టీలో రచ్చకు దారి తీసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. మల్లన్న నుంచి వివరణ రాలేదు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయటంతో… తీన్మార్ మల్లన్న దారెటు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. అయితే బీసీ వాదంతో కొత్త పార్టీ ప్రకటిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు కొత్త పార్టీ కాకుండా…. ఓ ప్రాంతీయ పార్టీలో చేరుతారని… ఆ పార్టీ పగ్గాలు ఆయన చేతికే వస్తాయన్న అభిప్రాయాలు, విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా…. గతంలో మాదిరిగా తిరిగి బీజేపీ పార్టీలో చేరుతారా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.ప్రస్తుత పరిణామాల మధ్య తీన్మార్ మల్లన్న… బీసీ వర్గాలకు చెందిన మేథావులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. అయితే నిజంగానే కొత్త పార్టీ ప్రకటించి జనాల్లోకి వెళ్తారా..? లేక బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది..! మరోవైపు.. ముందు నుంచి బహుజన సమాజం కోసమే తన యుద్ధం అంటూ నినదిస్తున్న మల్లన్న.. బీఎస్పీ పార్టీవైపు కూడా అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదంటూ సోషల్ మీడియాలో మరో చర్చ నడుస్తోంది. ఇన్ని విశ్లేషణలు, అంచనాల మధ్య.. తీన్మార్ మల్లన్న ఏం చేయబోతున్నారు.. ఎటువైపు అడుగులు వేయనున్నారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »