టార్గెట్ స్లీపర్ సెల్స్

టార్గెట్ స్లీపర్ సెల్స్

హైదరాబాద్, నిర్దేశం:
2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. పుల్వామా 2019 తర్వాత జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటి. ఈ దాడి తర్వాత, కర్ణాటక సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యంగా బెంగళూరులో భద్రతను పటిష్టం చేసుకునేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది కేంద్రం. పాక్‌ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. మెడికల్‌ వీసాలకు మాత్రం ఏప్రిల్‌ 29 వరకు అనుమతి ఇచ్చారు. భారత పౌరులు పాకిస్తాన్‌ వెళ్లరాదని కేంద్రం సూచించింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి, పాకిస్థానీయులను వెంటనే పంపించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుండి అక్రమ వలసదారులను, స్లీపర్ సెల్స్‌ను వెతికే పనిలో పడ్డారు కర్ణాటక పోలీసులు.సార్క్ వీసా మినహాయింపు పథకం  కింద పాకిస్తానీ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించకుండా నిషేధించాలన్న కేంద్రం ఆదేశాలను అనుసరించి, చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని వారిని గుర్తించి బహిష్కరించడంలో కర్ణాటక ప్రభుత్వం అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటుందని కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర స్పష్టం చేశారు.

అక్రమ నివాసితులపై ఉచ్చు బిగించడంతోపాటు.. సరైన డాక్యుమెంటేషన్ లేని పాకిస్తాన్ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పరమేశ్వర తెలిపారు. “కేంద్ర నిఘా సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను గుర్తించి, అదుపులోకి తీసుకుని, బహిష్కరణ కోసం వారిని హైకమిషన్‌కు అప్పగిస్తామని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి, కర్ణాటక రాష్ట్ర పోలీసులు లాడ్జీలు, అతిథి గృహాలు, ఇతర స్థావరాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. స్లీపర్-సెల్ కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారం అందిన వెంటనే చర్య తీసుకోవడానికి నగరవ్యాప్తంగా స్థానిక పోలీసు స్టేషన్లలో CBI, IB అధికారులను మోహరించారు.బెంగళూరులో పాకిస్తానీయులు ఉన్నారంటూ ఇటీవలి శాసనసభ సమావేశంలో పరమేశ్వర తెలిపారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 137 మంది అక్రమ వలసదారులను గుర్తించి అరెస్టు చేసిందని, వారిలో 25 మంది పాకిస్తానీ జాతీయులు అని వెల్లడించారు. ఇందులో 84మందిని బెంగళూరు నగరంలోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ నుండి వచ్చి సరియైన పత్రాలు లేని నివాసితులకు బెంగళూరు మహానగరం ప్రాథమిక కేంద్రంగా మారిందన్నారు.2024 చివరలో, ఇంటెలిజెన్స్ బ్యూరో సూచన ప్రకారం బెంగళూరు శివార్లలోని జిగాని పారిశ్రామిక బెల్ట్‌లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నకిలీ పత్రాలతో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ఒక పాకిస్తానీ జాతీయుడు, మరో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. వారికి నకిలీ పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు తారుమారుకి దోహదపడే పెద్ద రహస్య నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇటువంటి స్లీపర్ సెల్స్ నెలలు, సంవత్సరాలు సైలెంట్‌గా ఉంటారని, పెద్ద టాస్క్‌లో భాగం అయ్యేవరకు నగరంలోని సాధారణ జనంతో కలిసిపోతారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నారు. స్లీపర్ సెల్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన బెంగళూరు పోలీసులు.. ఎలాంటి కమ్యునల్ హింసకు తావు లేకుండా…. వారి అంతు తేల్చగలరా అన్నది మున్ముందు తేలనుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »