ఇందిరమ్మ లబ్దిదారులకు స్వీట్ న్యూస్
నిర్దేశం, హైదరాబాద్ః
తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇళ్ల పట్టాలపై కీలక ప్రకటన చేశారు. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2024, మార్చి నెలలో ప్రారంభించినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం 4 లక్షల 50 వేల (4,50,000) ఇండ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశలు రేకెత్తించింది. కానీ అర్హులైన పేదలకు చివరకు నిరాశ నిస్పృహలనే బీఆర్ఎస్ పాలన మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలలో 34 వేల 5 వందల నలభై ఐదు (34,545) నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల (305.03 కోట్లు) నిధులను కేటాయించింది. ఔటర్ రింగు రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ సిటీ నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేసి, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇండ్లను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.