– అంబేద్కర్, కాన్షీరాం పార్కులపై సుప్రీంకోర్టు
– విగ్రహాలకు ప్రజాధనం వృధా కాలేదు
– పిటిషనర్లకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
నిర్దేశం, న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అంబేద్కర్ పార్కు సహా.. బహుజన సమాజ మహనీయులకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాయావతి నిర్మించిన స్మారకాలపై అప్పుడెప్పుడో 2009 నుంచి నడుస్తున్న కేసును సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఆ విషయమైన దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యల్ని విచారించబోమని, ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవాలని సుప్రీం తీర్పు చెప్పింది. రవికాంత్, సుకుమార్ అనే ఇద్దరు న్యాయవాదుల తరఫున ఈ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీం ధర్మాసనం పిటిషన్‌పై స్పందిస్తూ..ఈ అంశంపై ఇప్పటికే ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిందని, మళ్లీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదని పేర్కొంది.
విషయం ఏంటి?
2008-10 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి ఉన్నప్పుడు, రాష్ట్ర బడ్జెట్ నుండి రూ. 2,000 కోట్లు విగ్రహాల నిర్మాణానికి ఖర్చు చేశారని విమర్శలు వచ్చాయి. దీనిపై అనేక ప్రజాప్రయోజన వ్యాఖ్యలు దాఖలు అయ్యాయి. 60 ఏనుగుల విగ్రహాల ప్రతిష్ఠాపనకు రూ. 52.2 కోట్లు ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే కాకుండా ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధమని న్యాయవాది ప్రకాష్ కుమార్ సింగ్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి, ఈ బడ్జెట్ తో అంబేద్కర్ పార్క్ నిర్మించారు. వీరివే కాకుండా.. సావిత్రిబాయి ఫూలే, మహాత్మ ఫూలే, కాన్షీరాం పేరిట పార్కులు నిర్మించారు. వీటిపై కూడా అభ్యంతరాలు రావడం గమనార్హం.
కోర్టు ముందు మాయావతి ఏం చెప్పారు?
ఏప్రిల్ 2, 2019న తన నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టుకు తన వాదన వినిపించారు మాయావతి. బహుజన యోధుల స్మాకరాలను ప్రజలు కోరుకుంటున్నారని, అందులో ఏనుగు బొమ్మలు బౌద్ధానికి సంబంధించినవని, ఇక తన విగ్రహాలు కూడా ప్రజలు కోరుకుంటున్నారని, అవి ఉండి తీరాలని తెలిపారు. గతంలో కాంగ్రెస్ కూడా తమ నేతల విగ్రహాలను ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు. (దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నరసింహారావు విగ్రహాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి)
ఇక తాజాగా కూడా కోర్టుకు తన వాదన వినిపించారు మాయావతి. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీతో సహా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఏర్పాటు చేసిన విగ్రహాల ఉదాహరణలను ఆమె చెప్పారు. ఇది కాకుండా, ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో 221 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, ఇది రాష్ట్ర ఖజానాకు ఖర్చు అవుతుందని బీఎస్పీ సుప్రెమో అన్నారు.
లక్నో, నోయిడాలో పార్కులు
2007లో నాలుగోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మాయావతి.. 5 ఏళ్లు పూర్తికాలం అంటే 2012 వరకు ఉన్నారను. ఆమె పదవీకాలంలో యూపీ రాజధాని లక్నో సహా ఢిల్లీ సమీపంలోని నోయిడాలో రెండు పెద్ద పార్కులను నిర్మించారు. బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ పార్కులను ఏర్పాటు చేశారు. ఈ పార్కులో తతాగత గౌతమ బుద్ధుడి నుంచి నేటి కాన్షీరాం వరకు బీఎస్పీ అనుసరించే బహుజన మహనీయుల విగ్రహాలు రాతి, కంచుతో తయారు చేసి ఏర్పాటు చేశారు. ఇందులోనే మాయావతి విగ్రహాలు కూడా ఉంటాయి. అలాగే ఏనుగు బొమ్మలు కూడా ఉంటాయి.