జవాన్లకు సన్ స్ట్రోక్
ఖమ్మం, నిర్దేశం:
కర్రె గుట్టల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు ముఖ్యమైన నేతలు తలదాచుకున్నారన్న సమాచారంతో.. భద్రతా బలగాలు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే పలువురు మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా.. జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. భద్రతా బలగాలు డ్రోన్లు, హెలికాప్టర్లను ఉపయోగిస్తూ అణువణువు గాలిస్తున్నాయి. గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ డీఆర్జీ, సీఆర్పీఎఫ్ వంటి వివిధ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించేందుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు కూడా రంగంలో ఉన్నాయి. ఈ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితమైన స్థావరంగా ఉండటంతో.. భద్రతా బలగాలు అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఆపరేషన్ ముగిసే వరకు ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
దాదాపు 10 వేల మందికి పైగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచే కర్రె గుట్టలను అన్నీ వైపులా చుట్టుముట్టాయి. కర్రె గుట్టల చుట్టూ తూర్పున భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా చర్ల, దక్షిణాన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలు, ఉత్తరాన పూజారి కాంకేర్, పశ్చిమాన ఇంద్రావతి నది ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతున్నది.అయితే గత మూడు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ములుగు జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బండరాళ్ల కారణంగా మరో రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే 40 మందికి పైగా వడదెబ్బకు గురికాగా, ఆర్మీ హెలికాప్టర్‌లో దగ్గర్లోని వెంకటాపురం, భద్రాచలం ప్రభుత్వ హాస్పిటళ్లకు తరలించారు. కొందరిని రోడ్డు మార్గాన వరంగల్‌కు పంపించి చికిత్స అందిస్తున్నారు.కర్రె గుట్టల్లో కూంబింగ్ చేయడం అతి పెద్ద సవాల్ అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. గతేడాది జులైలో కూడా గుట్టల పైకి కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా బలగాలు.. ప్రతికూల వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఓవైపు ఎండ, మరోవైపు వానలో గుట్టలు ఎక్కుతూ దిగుతూ నాలుగు రోజుల పాటు 60 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ క్రమంలో జవాన్లు నడవలేని స్థితికి చేరుకున్నారు. గుట్టల్లో చిక్కుకున్న వారందరినీ స్థానికుల సహాయంతో గుర్తించి.. ఆర్మీ హెలికాప్టర్లలో హాస్పిటల్స్‌కు తరలించాల్సి వచ్చింది.