Take a fresh look at your lifestyle.

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువాలి

0 19

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువాలి

– జాడి వెంకటేష్, మండల వ్యవసాయధికారి
నిర్దేశం, నిజామాబాద్ :
విద్యార్థుల లక్ష్యం ఉన్నతంగా ఉండాలన్నారు సిరికొండ మండల వ్యవసాయధికారి జాడి వెంకటేష్ అన్నారు. ఉత్తమ ఆలోచనలకు సృజనాత్మకత తోడైతే విజయం సాధించడం సులభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

SSC, ఇంటర్మీడియట్ 2023లో సిరికొండ మండల టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు సత్యశోధక్ పాఠశాలలో శుక్రవారం సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రావుట్ల చిన్న నర్సయ్య నగదు మరియు ఉ త్తమ విద్యార్థుల పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు.

SSES ఛైర్మన్ ఆర్. నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల వ్యవసాయధికారి జాడి వెంకటేష్, గౌరవ అతిథిగా మండల వైద్యాధికారి డాక్టర్ చిట్యాల అరవింద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వ్యవసాయధికారి వెంకటేష్ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైనదని, పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉన్నత విద్యకు పునాదిలాంటిదని అన్నారు. విద్యార్థులు చదువు పైన శ్రద్ధ వహించి గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యపైన అవగాహనను పెంచుకొని ఇష్టమైన సబ్జెక్టుకు ప్రాధాన్యమివ్వాలని, ఐ.ఐ.టి. మెడిసిన్లలో ర్యాంకులు సాధించేలా పట్టుదలతో చదవాలన్నారు.


గౌరవ అతిథి డాక్టర్ చిట్యాల అరవింద్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని, చదువుతో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో అంతర్లీనంగా ప్రతిభ దాగి ఉంటుందని, దానిని మెరుగుపరుచుకొని ముందుకు వెళ్తే ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చన్నారు.

గత సంవత్సరం పదవ తరగతిలో సిరికొండ మండల టాపర్లుగా నిలిచిన బి. సిద్ధార్థ (సత్యశోధక్ పాఠశాల) ఎ. రిష్మిత (TSMS సిరికొండ), కె. స్పూర్తి, వి. కీర్తన (MJPRS చిమన్ పల్లి) మరియు ఇంటర్మీడియట్ లో సిరికొండ మండల్ టాపర్ గా నిలిచిన యస్. శ్రీలత (TSMS సిరికొండ)లకు ఈ సందర్భంగా రావుట్ల చిన్న నర్సయ్య స్మారక నగదు పురస్కారం (ఒక్కొక్కరికి రూ॥ 2500/-), ప్రత్యేక జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్కౌట్స్ & గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె. సాల్మన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు యం. బాలయ్య, వ్యవసాయ విస్తరణాధికారి ఎ.శ్రీకాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking