మోడీకి శ్రీలంక మిత్ర భూషణ్ అవార్డు
న్యూఢిలీ, నిర్దేశం:
భారత్-శ్రీలంక సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. ఇది ప్రధాని మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం. మిత్ర విభూషణ పురస్కారం అనేది దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. కొలంబోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. శ్రీలంకతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాల నాయకులను గౌరవించడానికి ప్రత్యేకంగా ఈ అవార్డును రూపొందించారుభారత ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం “శ్రీలంక మిత్ర విభూషణ” ప్రదానం చేయాలని నిర్ణయించిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రధాని మోదీ ఈ గౌరవానికి ఎంతో అర్హులని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం” ” అని లంక అధ్యక్షుడు దిస్సనాయకే అన్నారు. కాగా పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ గౌరవం కేవలం వ్యక్తిగత గుర్తింపు కాదని, 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవమని అన్నారు. అలాగే పురస్కారం అందించిన శ్రీలంక అధ్యక్షుడికి, ప్రభుత్వానికి, శ్రీలంక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. రెండు పొరుగు దేశాల మధ్య దీర్ఘకాల సంబంధానికి, బలమైన స్నేహానికి ఈ గౌరవం నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.