ప్రయోగించిన కాసేపటికే ఆకాశంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్

 ప్రయోగించిన కాసేపటికే ఆకాశంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్

ఉల్కాపాతాన్ని తలపించిన బ్లాస్టింగ్‌

న్యూఢిల్లీ, నిర్దేశం:
ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ తన వ్యాపారా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో 2030 నాటికి అంగారకుడిపై నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకు స్పేస్‌ ఎక్స్  సంస్థ ఆధ్వర్యంలో వ్యోమ నౌకలు, రాకెట్లు తయారు చేస్తున్నారు. ఇటీవలే ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. తాజాగా స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన స్టార్‌షిప్‌ రాకెట్‌ ప్రయోగంలో విఫలమైంది. ఈ రాకెట్, దాని ఎనిమిదో పరీక్షలో భాగంగా, టెక్సాస్‌ లోని బోకా చికా నుంచి గగనంలోకి ఎగిరింది. అయితే, అంతరిక్షంలోకి ప్రవేశించిన కొద్ది సమయంలోనే రాకెట్‌ పేలిపోయి ముక్కలైంది. ఈ పేలుడు శకలాలు దక్షిణ ఫ్లోరిడా మరియు బహమాస్‌లోని ప్రాంతాల్లో పడ్డాయి, ఇది దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సంఘటన వల్ల విమాన సేవలకు కొంత అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఈ ప్రయోగం చంద్రుడు, అంగారక గ్రహాలపైకి మానవ సహిత ప్రయాణాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి, అలాగే డమ్మీ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించినది. అయితే, ఈ ఏడాదిలో ఇది రెండో విఫలమైన ప్రయోగం కావడం గమనార్హం. జనవరి 2025లో జరిగిన స్టార్‌షిప్‌–7 ప్రయోగంలో కూడా రాకెట్‌ పేలి, శకలాలు కరేబియన్‌ సముద్రంలోని టర్క్స్‌ మరియు కైకోస్‌ దీవులపై పడ్డాయి. తాజాగా స్టార్‌షిప్‌ రాకెట్‌ ఇప్పటివరకు ఎనిమిది పరీక్షలను ఎదుర్కొంది. వీటిలో మే 2021లో జరిగిన ఎస్‌ఎన్‌–15 టెస్ట్‌ ఫ్లైట్‌ మాత్రమే పాక్షికంగా విజయవంతమైంది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన రాకెట్‌గా పేరొందిన స్టార్‌షిప్‌ 123 మీటర్ల (403 అడుగులు) ఎత్తుతో నాసా యొక్క శాటర్న్‌–V రికార్డును అధిగమించింది. దీని నిర్మాణానికి స్పేస్‌ఎక్స్‌ సుమారు 830 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ రాకెట్‌ను అంగారకుడు మరియు చంద్రుడిపైకి మానవులను చేర్చే లక్ష్యంతో రూపొందించారు.విఫలమైనప్పటికీ, స్పేస్‌ఎక్స్‌ ఈ పరీక్షలను ‘వేగంగా విఫలమై, వేగంగా నేర్చుకోవడం‘ అనే విధానంలో భాగంగా చూస్తోంది. ఈ సంఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ దర్యాప్తు చేస్తోంది.తదుపరి ప్రయోగాలకు అనుమతి ఈ దర్యాప్తు ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »