పహల్గాం మరణహోమం..
పాతబస్తీలో ‘‘పాకిస్తాన్ ముర్తాబాద్’’ నినాదాలు..
– ఉగ్రవాదులను శిక్షించాలని ర్యాలీలు..
– అస్సాంలో ఎమ్మెల్యే అరెస్ట్ – వినూత్న రీతిలో ఓవైసీ నిరసన
నిర్దేశం, హైదరాబాద్ :
హిందు – ముస్లీం భాయ్ భాయ్.. ఇది భారత దేశంలో పాలకుల నోట వినిపించే మాట.. కానీ.. అప్పుడప్పుడు భారతదేశంలో ఉండి శతృదేశమైన పాకిస్తాన్ కు అనుకూల నినాదాలు చేసే వారు ఉన్నారు. పాకిస్తాన్ – ఇండియా క్రికేట్ మ్యాచ్ కొనసాగిన సందర్భంలో హైదరాబాద్ లోని పాతబస్తీలో భారతదేశానికి వ్యతిరేకంగా.. పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసి 26 మందిని కిరాతంగా కాల్చి చంపినందుకు పాత బస్తీలోని ముస్లీంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందు – ముస్లీం భాయ్ భాయ్ అంటూ నల్లబ్యాడ్జీలు ధరించిన ముస్లీంలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ‘‘పాకిస్థాన్ ముర్దాబాద్..’’ అంటూ నినాదాలు చేశారు.
అస్సాంలో ఎమ్మెల్యే అరెస్ట్
పహల్గాంలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే, అస్సాంలోని మంకాచార్ నియోజకవర్గానికి చెందిన ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం పహల్గాం ఘటనలో పాకిస్తాన్ ను సమర్థించారు. ఎమ్మెల్యేగా ఉండి ఉగ్రవాదులకు అనుకూలంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సీరియస్ అయ్యారు. సీఎం ఆదేశాలతో ఎమ్మెల్యేని అరెస్టు చేసి, దేశద్రోహం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. …. వినూత్న రీతిలో ఓవైసీ నిరసన
పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రార్థనలకు ముందు శాస్త్రిపురంలోని మసీదు వద్ద ఆయన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చార్మినార్, మక్కామసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన వారికి అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా నల్ల బ్యాడ్జీలను పంపిణీ చేశారు. తాను కూడా చేతికి నల్ల బ్యాడ్జీ ధరించారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలని ఆయన అక్కడి వారికి పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.