కృష్ణాజలాలపై చర్చిద్దామా?
– ప్రతిపక్ష నేత కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
– గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిపారని మండిపాటు
– కేసీఆర్ వల్లే తెలంగాణకు కష్టాలన్న సీఎం రేవంత్
నిర్దేశం, హైదరాబాద్ః
తెలంగాణలో చాలా సమస్యలు కేవలం కేసీఆర్ ప్రభుత్వమే కారణమని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లతో కుమ్మకే వాటిని పరిష్కరించకుండా ఇప్పుడు వాటిని ఎత్తిచూపుతున్నారని మండిపడ్డారు. పథకాలు అమలు అవుతున్నా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసగించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిపారని మండిపడ్డారు. అప్పట్లో ఉన్న మహిళా గవర్నర్ అడుగడుగునా అవమానించారని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. వాటినే గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించామని వెల్లడించారు. అలాంటివి ప్రస్తావిస్తే కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం ఉందని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యకు అప్పులే కారణమని అందుకే రుణమాఫీ హామీ ఇచ్చామని తెలిపారు. వారిని రుణబాధల నుంచి విముక్తి చేసినట్టు వెల్లడించారు. వారికి ఇవ్వాల్సిన రైతు బంధును మార్చి 31 లోపు అందిర ఖాతాల్లో పడతాయని భరోసా ఇచ్చారు. స్టేచర్ అంటూ మాట్లాడే బీఆర్‌ఎస్‌ను ప్రజలు మార్చురీకి పంపించారని తాను అంటే ఏదో కేసీఆర్‌ను అన్నట్టు తప్పుడు ప్రచారం చేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పదేళ్లుగా మంత్రులు చేసిన వాళ్లంతా ఫైర్ అయ్యారని అన్నారు. ఇలానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా ఖాయమని అన్నారు.
వరి వేస్తే ఉరే అని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. కానీ తాము ధాన్యం కొనుగోలు చేసి రూ.1206 కోట్లు సన్న వడ్లకు బోనస్ అందించామని తెలిపారు. కాళేశ్వరం లేకుండానే రైతులు 1 కోటి 56 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారని వివరించారు. రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. పోరాటాలు చేశామని చెప్పుకునే కేసీఆర్ ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టి తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది వాళ్లు కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రాన్ని కలిసి నీళ్ల కోసం కొట్లాడామన్నారు. వైస్ ఆశీర్వాదంతో కేంద్రమంత్రి అయిన కెసీఆర్ పోతిరెడ్డిపాడు నీటిని తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నది నిజం కాదా అని నిలదీశారు. తెలంగాణ జిల్లాలను వలస జిల్లాలుగా మార్చి రైతులను పొట్టన పెట్టుకుంది వీళ్లేనని ఆరోపించారు. ఆనాడు వీళ్లు సహకరించకపోతే పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లు వెళ్లేవా అని ప్రశ్నించారు.
కెసిఆర్ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్ల కోసం కక్కుర్తి పడి జూరాలను రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించి… నీళ్లను శ్రీశైలానికి పంపించడం వల్ల ప్రాజెక్టును పూర్తి చేసినా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు రేవంత్. ఎస్ఎల్బీసీని నాలుగేళ్లల్లో పూర్తి చేయాల్సింది పదేళ్లైనా పూర్తి చేయకుండా నల్లగొండకు అన్యాయం చేసింది నిజం కాదా ప్రశ్నించారు. ఇవాళ జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి, ఎనిమిది మంది చావుకు కారణం వాళ్లు కాదా మండిపడ్డారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో పదేళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని కేసీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సంధానం ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ సభ నుంచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 15 నెలల్లో సభకు కెసిఆర్ కేవలం రెండుసార్లే వచ్చారన్నారు.
ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిన నాయకుడు కెసిఆర్ అని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి చేసి ఉంటే నల్లగొండ కష్టాలు తీరేది కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. కెసీఆర్ ఏ రోజు వస్తే ఆరోజు కృష్ణా జలాలపై చర్చ పెడదామని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. లెక్కలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమది తప్పయితే బీఆర్ఎస్ నాయకులకు క్షమాపణ చెప్పడానికి సిద్ధమని వెల్లడించారు. ఈ సవాలుకు కెసీఆర్ సిద్ధమా లేదో చెప్పాలన్నారు. రోజులు 10 టీఎంసీలు తరలించుకుపోయే ప్రాజెక్టులు పక్క రాష్ట్రం నిర్మిస్తుంటే కెసిఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని గుర్తు చేశారు. ఒక సామాన్య రైతు గ్రీన్ ట్రైబ్యునల్‌కు వెళితే విధి లేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఇంప్లీడ్ అయిందన్నారు. రోజా రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కెసిఆర్… రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును మాత్రం పట్టించుకోలేదన్నారు రేవంత్.