రైలులో లైగింక వేధింపులు…..బీహార్ యువకుడి అరెస్ట్..
సికింద్రాబాద్, నిర్దేశం:
కదులుతున్న రైల్లో వాష్ రూమ్ వద్ద మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడి వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్ కు తరలించారు.బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారం చేసి వీడియోలు చిత్రీకరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బీహార్ కు చెందిన సంతోష్ కుమార్ బతుకుదెరువు కోసం గత రెండేళ్లుగా బేగంపేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వాటర్ బాయ్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తన సోదరుడి వివాహం గత నెలలో జరగగా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక నెల 1న దర్భంగా రైల్వే స్టేషన్ లో రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో హైదరాబాద్ నగరానికి బయలుదేరాడు. ఒరిస్సా కు చెందిన ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి అదే రైల్లో మరసటి రోజు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వాష్ రూమ్ కు వెళ్లిన మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు గురిచేసిన సంతోష్ కుమార్ వాష్ రూమ్ లోనే ఆమెపైఅత్యాచారం చేసి వీడియో చిత్రీకరించాడు. కాసేపటికి నిందితుడి చెర నుండి బయటకు వచ్చిన బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ను పరిశీలించారు. వెంటనే నిందితుడు మరో భోగిలోకి పరారవడంతో టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి బాధితులు ఫిర్యాదు చేయడంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఫోన్ డేటా ఆధారంగా నిందితుడిని బేగంపేటలో పట్టుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. అనంతరం కేసును మహారాష్ట్రలోని ఇత్వారి జిఆర్పికి బదిలీ చేశారు.