కాళేశ్వరంలో ఘనంగా ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలు
– వేకువ జామున నదీ స్నానాలు ప్రారంభం
– స్వయంగా వెళ్లి ప్రారంభించిన సీఎం రేవంత్
నిర్దేశం, భూపాలపల్లిః
కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. గురు మదనానంద స్వామిజీ తొలి స్నానాలతో పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
కాళేశ్వరంలో ఘనంగా ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వేకువ జామున గురు మదనానంద స్వామిజీ తొలి స్నానాలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించే త్రివేని సంగమంలో సరస్వతీ పుష్కరాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామున 5.44కు మొదట పుణ్యస్నానాలతో సరస్వతీ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెలంగాణ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ దంపతులు కాళేశ్వరంలో పూజలు నిర్వహించారు.
గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. బుధవారం రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించగా అప్పటినుంచే పుష్కరకాలం మొదలైంది. ఉదయం 5.44కు ముహుర్తం నిర్ణయించి ఆ సమయంలో పూజలతో పుష్కరాలను ప్రారంభించారు.
15వ తేదీ గురువారం ఉదయం నుంచి ఈ నెల 26వ తేదీ సోమవారం వరకు పుష్కరాలు కొనసాగుతాయి. 12 ఏళ్లకు ఓసారి జరిగే పుష్కరాలకు లక్షలాది భక్తులు తరలి రానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరస్వతీ పుష్కరాలకు హాజరు కానున్నారు.
రూ.35కోట్లతో ఏర్పాట్లు సరస్వతీ నదీ పుష్కరాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. దీంతోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పుష్కరాల కోసం రూ.35 కోట్ల కేటాయించింది. దాదాపు రూ.21.5 కోట్లతో 65 పనులను వివిధ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగించగా, తాజాగా మరో రూ.8 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
శాశ్వత ప్రాతిపదిక చేపట్టే పనులకు మిగతా నిధులు విడుదల చేయనున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో కాళేశ్వరంలో ఏకశిలతో తయారు చేసిన 17 అడుగుల సరస్వతీ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి వద్ద భక్తులకు, వీఐపీలకు వేర్వేరుగా పుష్కర ఘాట్లను సిద్ధం చేశారు. ఎండల నేపథ్యంలో కాళేశ్వరంలో చలువ పందిళ్లు, శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించారు.
విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా కొత్తగా సబ్ స్టేషన్ కూడా నిర్మించారు. దాని ద్వారా పుష్కరాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అందిస్తామని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాలుగు జనరేటర్లను అందుబాటులో ఉంచారు. కాళేశ్వరానికి వచ్చే బస్సుల కోసం తాత్కాలిక బస్ స్టేషన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
పుష్కరాల కమిటీ ఏర్పాటు సరస్వతీ నది పుష్కరాల నేపథ్యంలో 18 మంది సభ్యులతో పుష్కరాల (ఫెస్టివల్) కమిటీని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కాళేశ్వరంలో భక్తుల భద్రత కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వంద మంది వరకు సేవలు అందించనున్నారు.
వీఐపీ ఘాట్, సరస్వతీ విగ్రహం, భక్తులు పుష్కరస్నానాలు ఆచరించే త్రివేణి సంగమం, గోదావరి ఘాట్, ఆలయం తదితర ప్రాంతాల్లో వీరు సేవలందిస్తారు. ఇందులో 34 మంది ఎన్డీఆర్ఎఫ్, 66 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉండనున్నారు. వీరంతా మూడు షిప్టుల్లో విధులు నిర్వహించనున్నారు.